Nitin Gadkari: డ్రైవర్‌లెస్‌ కార్లను భారత్‌లోకి అనుమతించబోం: నితిన్‌ గడ్కరీ

డ్రైవర్‌లెస్‌ కార్లను భారత్‌లోకి అనుమతించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.  

Published : 18 Dec 2023 17:27 IST

నాగ్‌పుర్‌: డ్రైవర్‌ అవసరం లేకుండా స్వయంచోదితంగా నడిచే కార్లు ఇప్పటికే పలు దేశాల్లో రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. వీటినే డ్రైవర్‌లెస్, సెల్ఫ్‌డ్రైవింగ్‌ లేదా అటానమస్‌ కార్లు అని కూడా పిలుస్తున్నారు. ఇలాంటి కార్లను భారత్‌లోకి అనుమతించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు. డ్రైవర్‌లెస్‌ కార్ల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. రహదారి భద్రతపై ఐఐఎమ్‌ నాగ్‌పుర్‌లో ‘జీరో మైల్‌ సంవాద్‌’ పేరిట జరిగిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. 

‘‘డ్రైవర్‌లెస్‌ కార్లను భారత్‌లోకి అనుమతించబోం. వాటి వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతారు. అది ఎప్పటికీ జరగనివ్వను. భారత్‌లో టెస్లా అమ్మకాలు చేపట్టేందుకు అనుమతిస్తాం. కానీ, చైనాలో కార్లను తయారు చేసి, భారత్‌లో విక్రయించేందుకు అంగీకరించం’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యతను తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు అధునాతన సాంకేతికతను స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

టెలికాం బిల్లులో వాట్సప్‌, టెలిగ్రామ్‌కు ఊరట..!

మరోవైపు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ల నిబంధన, రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రికలు ఏర్పాటు చేయడం, బ్లైండ్‌ స్పాట్‌లను తగ్గించడం, ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టాన్ని బలోపేతం చేసి ప్రమాదాలకు పాల్పడేవారికి పెద్ద ఎత్తున జరిమానాలను విధించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

భారత్‌లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లలో ఇప్పటికే ఆటోపైలట్‌ సాంకేతికత ఉంది. ఇది కారు స్టీరింగ్, ఎక్సలరేటర్‌, బ్రేక్‌ను మానవ ప్రమేయం లేకుండా నియంత్రిస్తుంది. ఒకవేళ నియంత్రించలేని పరిస్థితి ఉత్పన్నమైతే.. స్టీరింగ్‌ వైబ్రేట్‌ అవుతుంది. అలా, డ్రైవర్‌ స్టీరింగ్‌ను కంట్రోల్‌ చేయాలని సూచిస్తుంది. డ్రైవర్‌లెస్‌ కార్లలో కారు స్టీరింగ్‌ ఉండదు. నావిగేషన్‌, అటానమస్‌ సాంకేతికత ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ కార్లను భారత్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో పరీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని