china: షాంఘైలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు..!

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో వ్యాపారాల పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఏ ప్రిల్‌ నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదంటే

Published : 17 May 2022 13:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో వ్యాపారాల పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఏప్రిల్‌ నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2.5 కోట్ల జనాభా ఉన్న ఈ నగరం దాదాపు 7 వారాల నుంచి కఠిన లాక్‌డౌన్‌లో ఉంటోంది. అధికారులు దుకాణాలు మూసివేయించారు. తాజాగా సోమవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పశ్రేణి కార్యకలాపాలకు అనుమతిస్తామని వెల్లడించారు. చైనా ఆటోమొబైల్‌ పరిశ్రమకు షాంఘై గుండెకాయ వంటిది. మొత్తం కార్ల విక్రయాల్లో ఈ నగరం తొలి స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది మొత్తం ఇక్కడ 7,36,700 వాహనాలు అమ్ముడు పోయాయి. చైనాలోని ఒక నగరంలో జరిగిన అత్యధిక అమ్మకాలు ఇవే. దీంతోపాటు ఈ పరిశ్రమలోని దిగ్గజ సంస్థలైన ఫోక్స్‌వేగన్‌, టెస్లా, బాష్‌, జీఎఫ్‌ గ్రూప్‌నకు ఇక్కడ  ప్లాంట్లు ఉన్నాయి. దీంతో సప్లైఛైన్లలో కూడా భారీ అంతరాయాలు తలెత్తాయి. టెస్లా విక్రయాలు ఏప్రిల్‌లో 98శాతం పడిపోయాయి. చైనా ప్యాసింజర్స్‌ కార్స్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం ఇక్కడ ఉత్పత్తి 81శాతం తగ్గిపోయింది. షాంఘైలో లాక్‌డౌన్‌ ప్రభావంతో జపాన్‌లోని టొయోటా సంస్థ 14 ప్రొడక్షన్‌ లైన్స్‌లో ఆపరేషన్స్‌ను నిలిపివేసింది.

ఈ నగరంలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో  కార్ల విక్ర్రయాలు, డెలివరీలు గణనీయంగా పడిపోయాయని షాంఘై ఆటోమొబైల్స్‌ సేల్స్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ సోమవారం ప్రకటించింది. ఈ ప్రభావం చైనా మొత్తం ఆటోమైబైల్స్‌ విక్రయాలపై పడింది. దేశవ్యాప్తంగా విక్రయాలు 46శాతం పతనమై 1.2 మిలియన్లకు పడిపోయాయి. గత పదేళ్లలో చైనాలో ఇంత స్థాయి తక్కువ విక్రయాలు జరగలేదని చైనా అసోసియేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చరర్స్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని