No Claim Bonus: ఆరోగ్య బీమాలో నో-క్లెయిమ్ బోన‌స్ ఏ విధంగా ప్ర‌యోజ‌న‌క‌రం?

ఆరోగ్య బీమాలో నో క్లెయిమ్ బోన‌స్(ఎన్‌సీబీ) ప్ర‌యోజ‌నం పాలసీదారులకు ఒక ప్రోత్స‌హ‌కంలా ప‌నిచేస్తుంది.

Updated : 12 Aug 2022 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమాలో నో క్లెయిమ్ బోన‌స్ (NCB) ప్ర‌యోజ‌నం పాలసీదారులకు ఒక ప్రోత్స‌హ‌కంలా ప‌నిచేస్తుంది. ప్ర‌తి చిన్న కార‌ణంతో క్లెయిమ్ చేయ‌కుండా NCBని అందిస్తాయి. అంటే ప్ర‌తీ క్లెయిమ్ ర‌హిత సంవ‌త్స‌రానికి ఆరోగ్య బీమా సంస్థ‌లు పాల‌సీదారుల‌కు ఈ ప్ర‌యోజ‌నం అందిస్తాయి. ఒక‌వేళ పాల‌సీదారుడు నిర్దిష్ట సంవ‌త్స‌రంలో ఏదైనా క్లెయిమ్‌ను లేవ‌నెత్తిన‌ట్ల‌యితే నో-క్లెయిమ్ బోన‌స్ ప్ర‌యోజ‌నం ల‌భించ‌దు.

ఎలాంటి పాల‌సీల‌కు వ‌ర్తిస్తుంది?
ప్ర‌తీ ఆరోగ్య బీమా పాల‌సీ నో-క్లెయిమ్ బోన‌స్‌ను అందించ‌దు. ఇది ఆయా సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అలాగే వ్య‌క్తిగ‌త‌, ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీలు రెండింటికీ నో-క్లెయిమ్ బోన‌స్ ప్ర‌యోజ‌నాన్ని బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ కుటుంబ స‌భ్యులంద‌రికీ క‌వ‌రేజీని అందిస్తుంది. కుటుంబంలోని ఏ వ్య‌క్తికి అవ‌స‌ర‌మైనా క్లెయిమ్ చేయాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి క్లెయిమ్ ర‌హిత సంవ‌త్స‌రాలు త‌క్కువ‌గా ఉండొచ్చు. అయితే వ్య‌క్తిగ‌త‌, ఫ్యామిలీ ఫ్లోట‌ర్‌తో సంబంధం లేకుండా క్లెయిమ్ ర‌హిత సంవత్స‌రాల‌కు నో-క్లెయిమ్ బోన‌స్ పొందొచ్చు. మీరు తీసుకున్న పాల‌సీకి నో-క్లెయిమ్ బోన‌స్ ఆప్ష‌న్ ఉందా? లేదా? ఉంటే ఏ రూపంలో ఇస్తారు? గరిష్ఠ ప‌రిమితి ఎంత? ఇత‌ర ష‌ర‌తులు ఏమైనా ఉన్నాయా? అనేది పాల‌సీ తీసుకునే స‌మ‌యంలోనే పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చ‌దివి తెలుసుకోవాలి.

నో-క్లెయిమ్ బోన‌స్ ఎన్ని ర‌కాలుగా ల‌భిస్తుంది?
సాధార‌ణంగా NCB రెండు ర‌కాలుగా ఉంటుంది. 1. కుమ్యులేటీవ్ బోన‌స్ 2. ప్రీమియంపై డిస్కౌంట్‌

1. కుమ్యులేటీవ్ బోన‌స్‌: ఈ ప్ర‌యోజ‌నం కింద పాల‌సీదారుడు ఎలాంటి క్లెయిమూ చేయ‌క‌పోతే క‌వ‌రేజీ/బీమా మొత్తాన్ని పెంచుతారు. ఉదాహ‌ర‌ణ‌కు మీ బీమా సంస్థ ప్ర‌తీ క్లెయిమ్-ఫ్రీ ఏడాదికి 5 శాతం నో-క్లెయిమ్ బోన‌స్ ఇస్తుంద‌నుకుందాం. మీ ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియం రూ.10 వేలు, క‌వ‌రేజీ రూ.6 ల‌క్ష‌లు అయితే మొద‌టి ఏడాది పాల‌సీ క్లెయిమ్ చేయ‌క‌పోతే.. బోన‌స్ కింద ఇచ్చే 5 శాతం క‌లిపి త‌ర్వాతి సంవ‌త్స‌రం క‌వ‌రేజీ రూ.6.30 ల‌క్ష‌ల‌కు పెరుగుతుంది. రెండో సంవ‌త్స‌రం కూడా క్లెయిమ్‌లు లేక‌పోతే క‌వ‌రేజీ రూ.6.61 ల‌క్ష‌ల‌కు పెరుగుతుంది. ప్రీమియం రూ.10 వేల‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండ‌దు. మూడో సంవ‌త్స‌రం క్లెయిమ్ చేయాల్సి వ‌స్తే రూ.6.61 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌వ‌రేజీ ల‌భిస్తుంది.

ఎంత వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు..?: పాలసీదారుడు క్యుములేటివ్ బోనస్ ద్వారా పాలసీ క‌వ‌రేజీని పెంచుకోవ‌చ్చు. అయితే దీనికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది. సాధారణంగా కవరేజీ మొత్తాన్ని అసలు బీమా మొత్తంలో 50 నుంచి 100 శాతం వరకు పెంచుకోవ‌చ్చు. ఎంత వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు అనేది బీమా సంస్థ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అలాగే.. ఇందుకు సంబంధించిన నియ‌మాలు, ష‌ర‌తులు కూడా బీమా సంస్థ‌ను బ‌ట్టి మారుతుంటాయి. పై ఉదాహ‌ర‌ణ‌ని తీసుకుంటే..మీ బీమా సంస్థ కుమ్యులేటీవ్ బోన‌స్ గ‌రిష్ట ప‌రిమితి 50 శాతం అనుకుంటే..ప్ర‌తీ సంవ‌త్స‌రం 5 శాతం చొప్పున గ‌రిష్టంగా రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే క‌వ‌రేజీను పెంచుకునే అవ‌కాశం ఉంటుంది.

2. ప్రీమియంపై డిస్కౌంట్‌: కొన్ని సంస్థ‌లు..ప్ర‌తీ క్లెయిమ్ ర‌హిత సంవ‌త్స‌రానికి ప్రీమియంలో రాయితీ ఇస్తుంటాయి. ఇక్క‌డ క‌వ‌రేజీలో మాత్రం ఎటువంటి మార్పూ ఉండ‌దు. పై ఉదాహ‌ర‌ణ‌ని తీసుకుంటే మొద‌టి సంవత్స‌రం క్లెయిమ్ చేయ‌నందుకుగానూ రెండో సంవ‌త్స‌రం ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తే.. రెండో సంవ‌త్స‌రం రూ.5 ల‌క్ష‌ల బీమా క‌వ‌రేజ్‌కి గానూ రూ.10 వేల‌కు బ‌దులుగా రూ.9,500 చెల్లిస్తే స‌రిపోతుంది. మూడో సంవ‌త్స‌రం రూ.5 ల‌క్ష‌ల బీమా క‌వ‌రేజ్‌కి రూ. 9025 ప్రీమియం చెల్లిస్తే స‌రిపోతుంది. ప్రీమియం త‌గ్గింపుల‌పై కూడా ప‌రిమితి ఉంటుంది. అందువ‌ల్ల పాల‌సీ తీసుకునే ముందు ఈ వివ‌రాల‌ను పూర్తిగా తెలుసుకోవాలి.

చివ‌రిగా: జీవ‌న‌శైలిలో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా చిన్న‌, పెద్ద తేడా లేకుండా అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. వైద్య ఖ‌ర్చులు కూడా రోజురోజుకూ భారంగా మారుతున్నాయి. ఈ ప‌రిస్థితిల్లో ఆరోగ్య బీమా ఉండ‌డం ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం. మంచి జీవిన శైలి అల‌వాట్ల‌తో క్లెయిమ్‌ల‌ను నివారించ‌డం వ‌ల్ల నో-క్లెయిమ్ బోన‌స్‌తో మీ అవసరాన్ని బట్టి ప్రీమియం త‌గ్గించుకోవ‌చ్చు లేదా క‌వ‌రేజీను పెంచుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు