నో కాస్ట్ ఈఎంఐ గురించి మీకు తెలుసా? 

ఆర్‌బీఐ గ‌తంలో విడుద‌ల చేసిన‌ నోటిఫికేషన్ ప్రకారం,  ఆర్థిక సంస్థలు జీరో వడ్డీ రుణాలను మంజూరు చేయ‌డం నిషేదం.

Updated : 30 Jan 2021 19:03 IST

దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అందించే నో కాస్ట్ ఈఎంఐ గురించి మీకు తెలుసా? నో కాస్ట్ ఈఎంఐ అనగా జీరో వడ్డీ, జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు అని వారు చెప్తుంటారు. కానీ ఇది ఎలా సాధ్యం? జీరో వడ్డీకే రుణాలను అందించే ఆర్థిక సంస్థలను నిషేదిస్తూ ఆర్‌బీఐ గ‌తంలో(సెప్టెంబర్ 17, 2013)నే ఒక  నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం,  జీరో వడ్డీతో రుణాలు ఇవ్వ‌రాదు. మ‌రి నో కాస్ట్ ఈఎంఐని ఎలా అందించగలరు?

మొదటగా ఆన్ లైన్ అమ్మకాల వ్యాపారంలో పాల్గొనే వారి గురించి తెలుసుకుందాం.

కొనుగోలుదారులు:

ఎవరైతే ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేస్తారో వారిని కొనుగోలుదారులు అంటారు. అది మీరు కూడా కావచ్చు.

అమ్మకందారులు:

అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ సంస్థలు అమ్మకందారులు కాదు, కానీ అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ సంస్థల ద్వారా ఆర్డర్లను పొంది వస్తువులను లేదా బ్రాండ్లను విక్రయించే వారిని అమ్మకందారులు అంటారు. వస్తువులను కొనుగోలు చేసిన‌ప్పుడు బిల్లుపై అమ్మకందారుల వివరాలను మీరు గమనించవచ్చు.

అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్:

వీరు కేవలం కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య వారిదిగా ఉండి డబ్బు సంపాదిస్తారు.

అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ నుంచి నో కాస్ట్ ఈఎంఐ ఎలా పని చేస్తుంది?

నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒక ఆఫర్. ఈఎంఐ ప్రొవైడర్ కు మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని, వస్తువు ధర ఆధారంగా గరిష్టంగా మూడు లేదా ఆరు నెలల పాటు సమానంగా విభజిస్తారు. డబ్బు చెల్లించే సమయంలో బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీని డిస్కౌంట్ రూపంలో వినియోగదారులకు అందించి, దానినే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ గా పేర్కొంటారు.

దీనిని వివరంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం.

మీరు రూ. 30 వేలు ఖర్చు చేసి ఒక వస్తువుని కొనుగోలు చేశార‌నుకుందాం. నో కాస్ట్ ఈఎంఐ కింద రూ. 638 డిస్కౌంట్ లభిస్తుందని అనుకుందాం. మీ బ్యాంకు 3 నెలలు ఈఎంఐకి వసూలు చేసే వడ్డీకి ఈ మొత్తం సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఆ వస్తువు ధర రూ. 29,362 కు తగ్గుతుంది. మీ బ్యాంక్ రూ. 29,362 పై వడ్డీ విదిస్తుంది. దీనిని అసలు రుణ మొత్తంగా పరిగణిస్తారు. బ్యాంక్ క్రెడిట్ రూ. 29,362 + 3 నెలలకు గాను వడ్డీ రూ. 638 = రూ. 30,000. ఈ మొత్తాన్ని మూడు నెలల ఈఎంఐ కింద మారుస్తారు. అనగా నెలకు రూ. 10000 అని అర్ధం.

చివరికి మీరు వడ్డీ, డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రూ. 30,000 విలువగల వస్తువుకి మూడు వాయిదాలలో రూ. 10,000 చొప్పున చెల్లిస్తారు.

నో కాస్ట్ ఈఎంఐ డిస్కౌంట్ ను ఎవరు చెల్లించాలి?

పైన పేర్కొన్న విధంగా, ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం ఎటువంటి ఆర్ధిక సంస్థలు జీరో పర్సెంట్ వడ్డీతో రుణాన్ని జారీ చేయడానికి అనుమతి లేదు.

ఇలాంటి పరిస్థితిలో మీ వడ్డీని ఎవరు చెల్లించాలి?

అసలైతే దీనిని మీరు గానీ లేదా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ గానీ చెల్లించాలి. కానీ ఆ భారాన్ని అమ్మకందారులు లేదా రిటైలర్ వారిపై వేసుకుంటారు. అందువలన మీరు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

ఎందుకు నో కాస్ట్ ఈఎంఐ అంత తక్కువ వ్యవధితో ఉంటుంది ?

ఒకవేళ మీరు నో కాస్ట్ ఈఎంఐలను గమనించినట్లయితే, అవి కేవలం 3 నుంచి 6 నెలల వరకు మాత్రమే పరిమితం అవుతాయి. ఎందుకంటే దీనిని విక్రేతలు, రిటైలర్లు భరిస్తారు. ఒకవేళ రుణ కాలపరిమితిని ఎక్కువ నెలలు అందిస్తే, అప్పుడు వారు నష్టాలను చవిచూడాల్సి వ‌స్తుంది.

వారు నో కాస్ట్ ఈఎంఐలను తక్కువ కాలపరిమితితో అందించడం ద్వారా మీరు ఎలాంటి వడ్డీ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా నెలవారీగా కొంత మొత్తాన్ని చెల్లించడంలో సౌకర్యవంతమైన అనుభూతిని పొందుతారు, కానీ అదే సమయంలో వారు నష్టాన్ని భర్తీ చేసుకోడానికి అధిక మొత్తంలో వస్తువులను అమ్మాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వ‌ల్ల‌ మీరు, బ్యాంకులు, అమ్మకందారులు చాలా సంతోషంగా ఉంటారు.

నో కాస్ట్ ఈఎంఐ వాస్తవానికి జీరో కాస్ట్ ఈఎంఐ కాదా?

ఈ విధ‌మైన రుణాలపై బ్యాంకులు పన్ను కూడా వసూలు చేస్తాయి. అందువల్ల‌, మీరు ఈఎమ్ఐ ద్వారా వస్తువులను కొన్నప్పుడు పన్ను రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంద‌ని గుర్తించుకోండి. ఇక్కడ పన్ను అనగా జీఎస్‌టీ, ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. పన్నును పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాస్తవంగా ఎంత చెల్లించాలో చూద్దాం.

నో కాస్ట్ ఈఎంఐ ఎలా పనిచేస్తుంది?

పైన ఉదాహరణలో తెలిపిన విధంగా, మూడు నెలలకు గాను నెలకు రూ. 10,000 ఈఎంఐ అయినప్పటికి, అసలు ఈఎంఐ దీనికంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మూడు నెలల తరువాత మీరు రూ. 30,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తారు. అమ్మకందారుడు సొంతంగా రూ. 638 వడ్డీని చెల్లిస్తున్నప్పటికీ, మీరు అసలు ఈఎంఐ కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తారు, ఈ ఆన్లైన్ సెల్లింగ్ పోర్టల్స్ సరిగ్గా గుర్తించే విధంగా వీటిని ప్రదర్శిస్తాయి. అమ్మకందారుడు రూ. 638, అలాగే మీరు పన్ను రూపంలో రూ. 114 చెల్లిస్తారు.

చివరగా, నో కాస్ట్ ఈఎంఐ అనేది పూర్తిగా జీరో వడ్డీ లేదా జీరో ప్రాసెసింగ్ ఈఎంఐ కాదు, మీరు ఇప్పటికీ వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా వస్తువులను కొనుగోలు చేసే ముందు ఒకసారి ఈ ధరని తనిఖీ చేయండి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని