Ukraine Crisis: మన చమురు దిగుమతులపై ప్రభావం ఎంత..? ధరల మాటేంటి?

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య వల్ల ఓ వైపు అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. క్రూడాయిల్‌ ధరలు భగ్గమంటున్నాయి. బంగారం ధరలు సైతం ఎగబాకుతున్నాయి.

Published : 24 Feb 2022 17:51 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా (Ukraine Crisis) సైనిక చర్య వల్ల ఓ వైపు అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. క్రూడాయిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. బంగారం ధరలు సైతం ఎగబాకుతున్నాయి. చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న వేళ.. మన దేశంపై ఈ ప్రభావం ఎంత అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయిస్తోంది. ముఖ్యంగా మన చమురు వినియోగంలో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తత పరిస్థితులు దిగుమతలపై ప్రభావం చూపుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, చమురు దిగుమతుల విషయంలో అలాంటి అనవసర భయాలేవీ అక్కర్లేదని ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. ధరల పెరుగుదల ఒక్కటే ఆందోళన కలిగించే విషయమని చెప్పారు.

రష్యా చర్య వల్ల ప్రస్తుతానికి సప్లయ్‌ చైన్‌ విషయంలో ఎలాంటి భయాలూ అక్కర్లేదని ఆ అధికారి పేర్కొన్నారు. మన దేశానికి మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర అమెరికా నుంచే చమురు దిగుమతి అవుతోందని తెలిపారు. కాబట్టి రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితుల వల్ల దిగుమతులపై ప్రభావం ఉండదని చెప్పారు. పరిస్థితులు మరింత దిగజారినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు. దేశానికి దిగుమతి అయ్యే చమురులో సౌదీ అరేబియా, ఇరాక్‌, ఇతర మధ్యప్రాచ్య దేశాల వాటా 63.1 శాతంగా ఉండగా... ఆఫ్రికా నుంచి 14 శాతం, ఉత్తర అమెరికా 13.2 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ఈ విషయంలో రష్యా వాటా పరిమితమే.

ధరలే అసలు సమస్య..
ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్‌ చమురు ధర 103 అమెరికన్‌ డాలర్లకు చేరింది. 2014 తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం ఇదే తొలిసారి. 2014 ఆగస్టు 14న గరిష్ఠంగా 103.78 డాలర్లు పలికిన బ్యారెల్‌ చమురు ధర.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలు పెరగడం లేదు. గత 113 రోజులుగా చమురు ధరలు సవరించడం లేదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఇందుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. ఒకసారి ఎన్నికలు పూర్తయ్యాక చమురు ధరలను ఆయిల్‌ కంపెనీలు సవరించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు 82-83 డాలర్ల వద్ద బ్యారెల్‌ చమురు ధర ఉన్నప్పుడు దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.41 ఉండగా.. డీజిల్‌ ధర రూ.86.67  వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ పెట్రోల్‌ ధర రూ.100కు పైగానే ఉంది. మార్చి 7తో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా చమురు ధరలు సవరిస్తారని తెలుస్తోంది. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏ మేర పెంచుతారన్నది ఇప్పుడు సగటు వినియోగదారుడి ముందున్న ప్రశ్న. ఒకవేళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగితే సామాన్యుడిపై నేరుగా భారం పడడమే కాకుండా.. నిత్యావసర వస్తువులు సైతం పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని