Rs.2000 నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన పని లేదు: SBI

Rs.2000 Notes: రూ.2000 నోట్లను మార్చుకునే సమయంలో గుర్తింపు కార్డు సమర్పించాలని, బ్యాంకులో ఇచ్చే ఫారాన్ని నింపాల్సి ఉంటుందని వస్తున్న ఊహాగానాలపై ఎస్‌బీఐ స్పష్టతనిచ్చింది.

Updated : 21 May 2023 15:24 IST

దిల్లీ: రూ.2,000 నోట్ల (Rs.2000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునే సమయంలో ఫారం నింపాల్సి ఉంటుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదైనా గుర్తింపు ధ్రవపత్రాన్ని కూడా సమర్పించాలని కొందరు అంటున్నారు. అయితే, వీటిపై తాజాగా బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ స్పష్టతనిచ్చింది.

రూ.2,000 నోట్ల (Rs.2000 Notes) మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ (SBI) స్పష్టం చేసింది. రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే ఎలాంటి ఐడీ ప్రూఫ్‌ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. నోట్ల మార్పిడి సమయంలో రిక్విజషన్‌ ఫారం నింపాల్సి ఉంటుందని.. దానికి ఆధార్‌ కార్డ్‌ లేదా ఇతర గుర్తింపు కార్డులు ప్రూఫ్‌గా సమర్పించాల్సి ఉంటుందని సోషల్‌ మీడియాలో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్‌బీఐ (SBI) ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు అన్ని బ్యాంకు శాఖలకు ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.మురళీధరన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

చలామణి నుంచి రూ.2,000 నోటు (Rs.2000 Notes)ను ఉపసంహరిస్తూ శుక్రవారం ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్న ప్రజలు వాటిని ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వెల్లడించింది. ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని