LIC: ఆరోగ్య బీమాలోకి వచ్చే ప్రతిపాదనలు లేవు: ఎల్‌ఐసీ

ఆరోగ్య బీమా విభాగంలోకి రావాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి లేవని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం స్టాక్‌ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది.

Published : 15 Jun 2024 02:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య బీమా విభాగంలోకి రావాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి లేవని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం స్టాక్‌ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. ‘సంస్థ వృద్ధి, విస్తరణ కోసం ఉన్న అన్ని అవకాశాలనూ వ్యూహాత్మకంగా వినియోగించుకుంటాం. ఇందులో భాగంగా కొన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, పెట్టుబడులు పెట్టడం లాంటి చర్యలు కొనసాగుతాయి’ అని అందులో పేర్కొంది. ప్రస్తుతం బీమా చట్టం 1938 ప్రకారం జీవిత బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను అందించడం కుదరదు. వీటిని సాధారణ బీమా సంస్థలు, లేదా ఆరోగ్య బీమా సంస్థలు అందించాలి. ఈ నిబంధనలను మార్చి, బీమా సంస్థలకు కాంపోజిట్‌ లైసెన్సు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఒక పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఫిబ్రవరిలో ఈ కమిటీ తన నివేదికను అందిస్తూ.. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా పాలసీలన్నీ ఒకే సంస్థ నుంచి ఇచ్చేందుకు వీలు కల్పించాలని, తద్వారా బీమా విస్తృతి పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీకి సైతం కాంపోజిట్‌ లైసెన్సు లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంపైనే ఎల్‌ఐసీ స్పష్టతనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని