Mukesh Ambani: 5G కంటే మాతాజీ, పితాజీనే గొప్ప: ముకేశ్‌ అంబానీ

ఈ ప్రపంచంలో మాతాజీ, పితాజీ కంటే ఏ జీ(5G) ముఖ్యమైనది కాదన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ (Reliance industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani). తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు.

Updated : 03 Dec 2022 15:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. అమ్మానాన్నల ప్రాముఖ్యాన్ని యువతకు అర్థమయ్యేలా వినూత్నంగా చెప్పారు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani). ఈ ప్రపంచంలో మాతాజీ, పితాజీ కంటే ఏ జీ (5G) ముఖ్యమైనది కాదన్నారు. ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ విద్యార్థులకు అంబానీ ఈ గొప్ప సందేశమిచ్చారు.

గుజరాత్‌లోని పండిత్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీలో గతవారం స్నాతకోత్సవం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ముకేశ్‌ అంబానీ.. విద్యార్థులనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ఇది మీ రోజు. ప్రపంచానికి మీరెంటో తెలిసే రోజు. కానీ మీరు నిల్చున్నది మాత్రం.. మీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ల రెక్కలపైనే. అందువల్ల ఇది వారికి కూడా ప్రత్యేకమైన రోజు. ఈ వేదిక ఎక్కి మీరు గ్రాడ్యుయేషన్‌ పత్రాన్ని అందుకోవాలని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అది వారి చిరకాల స్వప్నం కావొచ్చు. మిమ్మల్ని ఇక్కడివరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, వారు పడిన శ్రమను ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ విజయం వెనుక వారి సహకారం  ఎనలేనిది. మీకు ఎల్లప్పుడూ వారు అండగా ఉంటారు. మీ బలానికి మూలస్తంభాలు వారే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. ఈ రోజుల్లో ప్రతి యువత 4G, 5G గురించి ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలోనే మాతాజీ, పితాజీ కంటే ఏ ‘G’ ఎక్కువ కాదు. అది గుర్తుపెట్టుకోండి’’ అని ముకేశ్ అంబానీ యువతకు మార్గనిర్దేశం చేశారు.

దేశాభివృద్ధిలో నేటి యువత పాత్ర ఎంతో కీలకమని అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. యువ ఆలోచనలు, ఆవిష్కరణలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో.. ఇటీవల పలు నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు