IDBI Privatisation: ప్రైవేటీకరణ తర్వాత IDBIలో ప్రభుత్వం, ఎల్‌ఐసీ తలదూర్చబోవు!

ప్రైవేటీకరణ తర్వాత రాబోయే కొత్త ప్రమోటర్లు తీసుకురాబోయే ఎలాంటి ప్రతిపాదననూ ఇటు ప్రభుత్వంగానీ, అటు ఎల్‌ఐసీగానీ అడ్డుకోబోదని స్పష్టం చేశారు.

Published : 23 Oct 2022 23:33 IST

దిల్లీ: ప్రైవేటీకరణ తర్వాత కూడా ఐడీబీఐ (IDBI Privatisation)లో ప్రభుత్వం, ఎల్‌ఐసీకి మెజారిటీ వాటాలు ఉండనున్నాయి. దీంతో కీలక ప్రతిపాదనల విషయంలో అవి అడ్డుకునే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బిడ్లు దాఖలు చేయడానికి పెట్టుబడిదారులు వెనుకాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐడీబీఐకి (IDBI Privatisation) చెందిన ఓ ఉన్నతాధికారి దీనిపై స్పష్టతనిచ్చారు. సంస్థ నియంత్రణపై ఇటు ప్రభుత్వానికిగానీ, అటు ఎల్‌ఐసీకిగానీ ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 60 శాతం వాటా విక్రయించడానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఆ ఉద్దేశమే ఉంటే తక్కువ వాటాలు వదులుకునే వాళ్లమని తెలిపారు.

ప్రైవేటీకరణ (IDBI Privatisation) తర్వాత రాబోయే కొత్త ప్రమోటర్లు తీసుకురాబోయే ఎలాంటి ప్రతిపాదననూ తాము అడ్డుకోబోమని సదరు అధికారి స్పష్టం చేశారు. కావాలంటే దీనిపై బిడ్ల తుది ఎంపిక ప్రక్రియ సమయంలోనే విజయవంతమైన బిడ్డర్లకు హామీ ఇస్తామని తెలిపారు. కొత్త ప్రమోటర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. ఐడీబీఐ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 7న ప్రారంభించింది. 60.72 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు ఆహ్వానించింది. బిడ్లు లేదా ఆసక్తి వ్యక్తీకరణకు డిసెంబర్‌ 16ను తుది గడువుగా పేర్కొంది.

ఐడీబీఐలో ఎల్‌ఐసీకి ప్రస్తుతం 49.24 శాతం వాటాకు సమానమైన 529.41 కోట్ల షేర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటాకు సమానమైన 488.99 కోట్ల షేర్లున్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా 30.48 శాతం ఎల్‌ఐసీ వాటా, 30.24 ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నారు. యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేపట్టనున్నారు. బీఎస్‌ఈలో ఐడీబీఐ షేరు విలువ శుక్రవారం రూ.44.30 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వాటాల విక్రయం ద్వారా రూ.29,000 కోట్లు సమకూరనున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు