Nirmala Sitharaman: ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లతో జాగ్రత్త: నిర్మలా సీతారామన్‌

ఫైనాన్సియల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్ల సూచనలపై అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ సూచించారు. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 

Updated : 23 Apr 2023 18:20 IST

బెంగళూరు: పెట్టుబడుల అంశంలో ప్రజలకు సూచనలిచ్చే ఆర్థిక ప్రభావశీలురను (ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు)ను నియంత్రించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాల్లో అలాంటివారిని అనుసరిస్తూ.. వారి సూచనలు పాటించడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫైనాన్సియల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లలో (Financial Influencers) చాలా మంది తప్పుడు ఉద్దేశాలతో మోసపూరిత పథకాలను ప్రోత్సహిస్తుంటారని, పెట్టుబడులు పెట్టే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను అనుసరించడం వల్ల కలిగే నష్టాలను గురించి ఆమె హెచ్చరించారు.

కొందరు ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడే సూచనలు సలహాలు ఇచ్చినప్పటికీ.. ప్రజలను తప్పుదోవపట్టించే వాళ్లూ అందులో ఉంటారని సీతారామన్‌ అన్నారు. పదిమందిలో ముగ్గురు నలుగురు మంచి చేసే వారుంటే.. దాదాపు ఆరేడుగురు ప్రజలను మోసం చేసే వారే ఉంటారని అన్నారు. ‘‘ ఆర్థిక సలహాలు ఇచ్చేందుకు కొన్ని రకాల యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఇన్ని రోజులపాటు పెట్టుబడిపెడితే.. మీ డబ్బు ఇన్ని రెట్లు పెరిగిపోతుందని గుడ్డి లెక్కలు చెప్తారు. అందులో చాలా వరకు మోసపూరితమైనవే ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవడం ఉత్తమం’’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇలాంటి యాప్స్‌ను నియంత్రించేందుకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తనవంతు కృషి చేస్తుందన్నారు. 

కొవిడ్‌ విజృంభణ తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో భారత్‌ రిటైల్‌ భాగస్వామ్యం పెరిగిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం వెతుకుతున్నారని అన్నారు. ఈ క్రమంలో స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. అయితే, ఆర్థిక అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో ఫైనాన్సియల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్ల సలహాలపై ఆధారపడుతున్నారని చెప్పారు. దీనిని అలుసుగా తీసుకొని టెలిగ్రామ్‌, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారని, వీటివల్ల చాలా మంది మోసపోతున్నారని చెప్పారు. డిస్‌క్లెయిమర్‌ (గమనిక) లేకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వివిధ వీడియోలను పరిశీలిస్తున్నామని, వాటిని పోస్టు చేసిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

కొన్ని ఛానెళ్లు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ‘పంప్‌ అండ్‌ డంప్‌’ వ్యవహారానికి పాల్పడుతున్నాయని సీతారామన్‌ తెలిపారు. కొన్ని స్టాక్‌ల ధరలను కావాలనే ఒక్కసారిగా పెంచేసి.. వాటిని అమ్మజూపి .. తద్వారా లాభపడటాన్నే ‘పంప్‌ అండ్‌ డంప్‌’గా వ్యవహరిస్తారు. ఇలాంటి వాటిపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఓ కన్నేసి ఉంచుతుంది. ధ్రువీకరించని వ్యక్తుల నుంచి గానీ, సంస్థల నుంచిగానీ వచ్చిన సమాచారాన్ని నమ్మవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలంటూ ఇటీవల సెబీ కూడా పబ్లిక్‌ నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని