Mukesh Ambani: దేశ ఆర్థిక పునాదుల్ని ఎవరూ ప్రశ్నించలేరు: అంబానీ

Mukesh Ambani: యూపీ ఇన్వెస్టర్ల సదస్సులో ప్రధాని మోదీతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో రిలయన్స్‌ రూ.75,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. మన దేశ ఆర్థిక వ్యవస్థపై ముకేశ్‌ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 10 Feb 2023 16:02 IST

లఖ్‌నవూ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తాజా కేంద్ర బడ్జెట్‌ (Budget 2023) పునాదులు వేసిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) అన్నారు. భారత్‌ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని తాను బలంగా విశ్వసిస్తున్నానన్నారు. భారతీయులు అభివృద్ధి చెందిన దేశాల కంటే వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. మన దేశ ఆర్థిక పునాదుల్ని ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేరని ధీమా వ్యక్తం చేశారు.

4 ఏళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులు..

వచ్చే నాలుగేళ్లలో ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 5జీ మొబైల్‌ సేవల అమలు, రిటైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, పునరుత్పాదక ఇంధన వసతుల ఏర్పాటుకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. లఖ్‌నవూలో జరుగుతున్న ‘ఉత్తర్‌ప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు-2023’లో శుక్రవారం అంబానీ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

జీవఇంధన రంగంలోకి రిలయన్స్‌..

రిలయన్స్‌ జీవ ఇంధన రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అంబానీ ఈ సందర్భంగా ప్రకటించారు. పంట వ్యర్థాలను గ్యాస్‌గా మార్చి పరిశ్రమలకు ఇంధనంగా అందిస్తామన్నారు. వాహనాలు, వంటగదుల్లోనూ దీన్ని ఉపయోగించొచ్చని తెలిపారు. వచ్చే 10 నెలల్లో యూపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుత్పాదక ఇంధన వసతులను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5జీ సేవల్ని సైతం విస్తరిస్తామని తెలిపారు. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా అదనంగా మరో 1 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన రూ.50,000 కోట్ల పెట్టుబడులకు తాజా రూ.75,000 కోట్లు అదనమని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు