Rice Exports: ₹46వేల కోట్లకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు

2013-14లో 2.92 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల విలువ గత ఆర్థిక సంవత్సరానికి 6.11 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.46.6వేల కోట్లు)కు చేరినట్లు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం వెల్లడించింది....

Published : 20 Apr 2022 21:47 IST

కేంద్ర వాణిజ్యశాఖ వెల్లడి

దిల్లీ: 2013-14లో 2.92 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల విలువ గత ఆర్థిక సంవత్సరానికి 6.11 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.46.6వేల కోట్లు)కు చేరినట్లు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం వెల్లడించింది. 2021-22లో భారత్‌ దాదాపు 150 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసింది.

2019-20లో రెండు బిలియన్‌ డాలర్లు, 2020-21లో 4.8 బిలియన్‌ డాలర్లు, 2021-22లో 6.11 బిలియన్‌ డాలర్లు విలువ చేసే బియ్యాన్ని ఎగుమతి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. లాజిస్టిక్స్‌ అభివృద్ధితో పాటు నాణ్యమైన బియ్యం ఉత్పత్తి ఎగుమతుల వృద్ధికి దోహదం చేసినట్లు ‘అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలపమెంట్‌ అథారిటీ (APEDA)’ ఛైర్మన్‌ ఎం.అంగముత్తు తెలిపారు.

భారత్‌ నుంచి బాస్మతీయేతర బియ్యానికి పశ్చిమ ఆఫ్రికాకు చెందిన బెనిన్‌ దేశం ప్రధాన దిగుమతిదారుగా ఉంది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, చైనా, టోగో, సెనెగల్‌, గినీయా, వియత్నాం, జిబౌటీ, మడగాస్కర్‌, కెమరూన్‌, సొమాలియా, మలేషియా, లిబేరియా, యూఏఈ భారత బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఉన్నాయి. ఓడరేవుల్లో మౌలిక వసతుల విస్తరణ, సరఫరా గొలుసు అభివృద్ధి, ఇతర కీలక రంగాల సమన్వయంతో పాటు వివిధ మార్కెట్లలో ఉన్న అవకాశాలను ఒడిసిపట్టడం ద్వారా బియ్యం ఎగుమతుల్ని పెంచగలిగామని కేంద్రం తెలిపింది.

దేశంలో పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, అస్సాం, హరియాణా ప్రధాన బియ్యం ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. కేంద్రం అంచనాల ప్రకారం.. 2021-22లో దేశవ్యాప్తంగా 127.33 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి అయినట్లు సమాచారం. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని