GST: గడిచిన నెల జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయకుంటే..

గడిచిన నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్‌-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది....

Updated : 26 Dec 2021 17:05 IST

జీఎస్‌టీఆర్‌-1 సమర్పణకు అనుమతి ఉండదు

దిల్లీ: గడిచిన నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులను దాఖలు చేయని వ్యాపారులు జనవరి 1 నుంచి జీఎస్‌టీఆర్‌-1లో బయటకు పంపే సరఫరాలను నమోదు చేయడానికి వీలుండదని జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఏదైనా నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయడానికి తర్వాతి నెలలో 11వ రోజు వరకు గడువు ఉంటుంది. ఇక జీఎస్‌టీఆర్‌-3బీ(పన్ను చెల్లింపుల ఫారమ్‌) రిటర్నులను తర్వాతి నెలలో 20-24 రోజుల మధ్యలో చేస్తారన్న సంగతి తెలిసిందే. జీఎస్‌టీఆర్‌-1 రిటర్నులను దాఖలు చేయడంలో పరిమితిని విధించే సెంట్రల్‌ జీఎస్‌టీ నిబంధనల్లోని రూల్‌-59(6) జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుందని జీఎస్‌టీకి సాంకేతికత సహకారం అందిస్తున్న జీఎస్‌టీఎన్‌ స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఒక నమోదిత వ్యక్తి.. గడచిన నెలకు ఫారమ్‌ జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులు దాఖలు చేయకపోతే.. ఫారమ్‌ జీఎస్‌టీఆర్‌-1లో వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా (అవుట్‌వర్డ్‌)లను నమోదు చేయడానికి అనుమతి ఉండదు. అలాగే క్రితం నెల జీఎస్‌టీ చెల్లించడంలో విఫలమైనా.. జీఎస్‌టీఆర్‌-1ను దాఖలు చేయలేరు.

అలాగే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. లేదంటే రిఫండులకు దాఖలు చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. శుక్రవారం భేటీ అయిన జీఎస్టీ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ చెల్లింపుల ఎగవేతను నివారించడానికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మండలి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని