Twitter: ఆ అంశంపై ఇంకా ట్విటర్‌ నుంచి సమాచారం లేదు: కేంద్ర ఐటీ శాఖమంత్రి

Twitter: ట్విటర్‌లో బ్లూటిక్‌కు ఫీజు వసూలు చేయనున్నారనే వ్యవహారంపై కేంద్ర స్పందించింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని తెలిపింది. ట్విటర్‌ ప్రకటించిన తర్వాతే స్పందిస్తామని స్పష్టం చేసింది.

Published : 01 Nov 2022 00:10 IST

దిల్లీ: ట్విటర్‌లో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌కు డబ్బులు వసూలు చేయనున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు ఈ అంశంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సోమవారం తెలిపారు. దీనిపై కంపెనీ స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని తెలిపారు. కేవలం కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడడం సబబు కాదన్నారు. ఈ విషయంపై ట్విటర్‌ అధికారిక ప్రకటన చేసిన తర్వాతే తమ స్పందనను తెలియజేస్తామని తెలిపారు.

ఇటీవలే 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తొలుత ఉద్యోగుల తొలగింపుపై ఆయన దృష్టి సారించారని ఇటీవల ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆదాయం పెంచుకోవడం కోసం ప్రత్యేకంగా పెయిడ్‌ వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బ్లూ టిక్‌ సహా ఇతర అదనపు ఫీచర్లు అందించేందుకు నెలకు 20 డాలర్లు వసూలు చేయాలని.. అందుకు సంబంధించిన మార్పులను వేగవంతం చేయాలని మస్క్‌ ఉద్యోగులను ఆదేశించినట్లు సోమవారం పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనికి నవంబరు 7వ తేదీని డెడ్‌లైన్‌గా విధించినట్లు తెలిసింది. లక్ష్యాన్ని అందుకోకపోతే.. ఉద్యోగుల్ని తొలగిస్తామని కూడా ఆయన హెచ్చరించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని