రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు విదేశీ పెట్టుబడులను స్వీకరించబోం: గడ్కరీ

దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి విదేశీ పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించబోమని కేంద్ర  రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తేల్చి చెప్పారు.....

Updated : 05 Feb 2022 20:13 IST

ముంబయి: దేశంలో రోడ్లు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి విదేశీ పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించబోమని కేంద్ర  రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తేల్చి చెప్పారు. అవసరమైతే రూ.1లక్ష ఇవ్వగల చిన్న చిన్న దేశీయ మదుపర్ల నుంచి పెట్టుబడులు స్వీకరిస్తామని తెలిపారు. 8 శాతం వార్షిక రిటర్నులు ఆశించే ఎవరైనా ఈ కార్యక్రమాలకు నిధులు అందజేయొచ్చని స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో రైల్వే క్రాసింగ్స్‌, వంతెనలపై నుంచి రోడ్ల నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని గడ్కరీ తెలిపారు. కానీ, బడ్జెట్‌ సమావేశాల అనంతరం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. ఏటా తన శాఖ రూ.5 లక్షల కోట్లు విలువ చేసే పనులు చేపడుతోందని తెలిపారు. భారత రోడ్లు, రహదారుల నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపర్లు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. కానీ, తాను ఆ దిశగా ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నారు.

తాను ధనవంతుల్ని మరింత శ్రీమంతుల్ని చేయాలనుకోవడం లేదని గడ్కరీ వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కానిస్టేబుళ్లు, క్లర్కులు, ప్రభుత్వ ఉద్యోగుల వంటి సామాన్యుల నుంచి నిధులు సేకరిస్తామని పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ, అగ్రికల్చర్‌’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏటా 8 శాతం రాబడికి ప్రభుత్వ హామీ కల్పిస్తూ కనీసం రూ.లక్ష పెట్టుబడి పెట్టేలా ఓ పథకాన్ని రూపొందించామని తెలిపారు. ఇలా సేకరించిన నిధులను కేవలం రోడ్లు, రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకు మాత్రమే వినియోగించేటట్లు పథకం ఉండనుందన్నారు. దీనికి మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని