‘నియంత్రణపరమైన లోపాలున్నాయని చెప్పలేం’.. ‘అదానీ’ వ్యవహారంపై నిపుణుల కమిటీ

Adani group: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది. స్టాక్‌ ధరల్లో తారుమారు, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనలకు సంబంధించి నియంత్రణ పరమైన లోపాలు ఉన్నాయని నిర్ధారణకు రాలేమని తెలిపింది.

Updated : 19 May 2023 16:23 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌పై (Adani group) వచ్చిన ఆరోపణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు కీలక నివేదిక సమర్పించింది. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ధరల ర్యాలీ విషయంలో నియంత్రణ పరమైన లోపాలు జరిగాయని ప్రాథమికంగా అప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని తెలిపింది. అయితే, అదానీ గ్రూప్‌ విషయంలో హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌కు (Hindenburg) ముందు కొన్ని సంస్థలు షార్ట్‌ పొజిషన్లు తీసుకోవడం, రిపోర్ట్ తర్వాత స్టాక్‌ ధరలు పతనం అయినప్పుడు స్క్వేరింగ్‌ ఆఫ్‌ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. మోసపూరిత లావాదేవీలు, స్టాక్‌ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్‌ సంస్థలు పాల్పడ్డాయంటూ హిండెన్‌ బర్గ్‌ ఆరోపించింది. అదానీ గ్రూప్‌ సంస్థలు పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధననూ పాటించడం లేదని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలుగానీ, స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థలు గానీ జోక్యం చేసుకోలేదని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను అప్పట్లో అదానీ గ్రూప్‌ ఖండించింది. ఈ నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సెబీని సైతం దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించింది. సెబీ ఇచ్చిన వివరణ, అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్టాక్‌ ధరల తారుమారు విషయంలో నియంత్రణ పరమైన లోపాలు జరిగాయని ఇప్పటికిప్పుడే నిర్ధారణకు రాలేమని తన నివేదికలో కమిటీ పేర్కొంది. అలాగే, కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌కు సంబంధించి సెబీ వైపు నియంత్రణ పరమైన లోపాలు ఉన్నాయని చెప్పలేమని తెలిపింది. జనవరి 24న వెలువడిన రిపోర్ట్‌ తర్వాత అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా పెరిగిందని నివేదిక తెలిపింది. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ తీవ్రమైన ఒత్తిడికి గురైన తర్వాత.. మళ్లీ ఆ స్థాయికి చేరనప్పటికీ.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపింది. మరోవైపు అదానీ గ్రూప్‌ వ్యవహారంలో సెబీ దర్యాప్తునకు ఆగస్టు 14 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు