భారత్‌కు చమురు సరఫరా..సౌదీని మించిన అమెరికా!

భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. ఈ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను అగ్రరాజ్యం గత నెల అధిగమించింది. చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్‌ ప్లస్) ఉత్పత్తిలో........

Updated : 17 Oct 2022 14:30 IST

దిల్లీ: భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. ఈ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను అగ్రరాజ్యం గత నెల అధిగమించింది. చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్‌ ప్లస్) ఉత్పత్తిలో కోత విధించడంతో ఏర్పడ్డ లోటును పూడ్చుకునేందుకు అమెరికా నుంచి భారత్‌ భారీ స్థాయిలో కొనుగోలును పెంచింది. పైగా అమెరికా చమురు ధర కూడా తక్కువ. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా స్థానం గల్లంతయ్యింది.

అమెరికాలో ఇటీవల చమురు డిమాండ్‌ పడిపోయింది. ఇదే సమయంలో రోజుకి ఒక మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌ ప్లస్‌ దేశాలు నిర్ణయించాయి. ఈ పరిణామాలు భారత్‌కు కలిసొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా అమెరికా ఉన్న విషయం తెలిసిందే. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో భారత్‌కు అగ్రరాజ్యం నుంచి చమురు దిగుమతి 48 శాతం పెరిగింది. రోజుకు సగటున 5,45,300 బ్యారెళ్లు భారత్‌కు వచ్చాయి. భారత్‌కు దిగుమతి అవుతున్న మొత్తం చమురులో అమెరికా వాటా 14 శాతం.

ఇక ఫిబ్రవరిలో సౌదీ అరేబియా నుంచి దిగుమతులు 42 శాతం తగ్గాయి. రోజుకి 4,45,200 బ్యారెళ్ల చమురు అందింది. సౌదీ నుంచి దిగుమతులు ఈ స్థాయికి పడిపోవడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. 2006, జనవరి తర్వాత భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న జాబితాలో సౌదీ అరేబియా తొలిసారి నాలుగో స్థానానికి పడిపోయింది. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇరాక్‌ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఆ దేశం నుంచి భారత్‌కు చమురు ఉత్పత్తి 23 శాతం పడిపోయి ఐదు నెలల కనిష్ఠానికి చేరింది. అయినప్పటికీ తొలిస్థానంలోనే కొనసాగుతోంది. ఇరాక్‌ నుంచి రోజుకు సగటున 8,67,500 బ్యారెళ్ల చమురు భారత్‌కు అందుతోంది.

ఇవీ చదవండి...

ఎల్‌ఓసీ..ఈ రుణ సదుపాయం గురించి తెలుసా?

రుణరేట్లు తగ్గించిన బ్యాంకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని