బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరుగుతాయ్‌

బ్యాంకుల ఆస్తుల నాణ్యత గత ఏడాది రెండో అర్ధ భాగంలో మెరుగైనప్పటికీ, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో డీలా పడే అవకాశం

Published : 18 Mar 2021 14:18 IST

ముంబయి: బ్యాంకుల ఆస్తుల నాణ్యత గత ఏడాది రెండో అర్ధ భాగంలో మెరుగైనప్పటికీ, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో డీలా పడే అవకాశం ఉందని ఫిక్కీ-ఐబీఏ సర్వే వెల్లడించింది. 2021 తొలి 6 నెలల కాలంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేసింది.  2020 జులై-డిసెంబరు మధ్య కాలంలో ఫిక్కీ-ఐబీఏ కలిసి 20 బ్యాంకులపై ఈ సర్వే చేశాయి.  ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగ, విదేశీ బ్యాంకుల్ని సైతం పరిగణనలోకి తీసుకున్నాయి. ఆస్తుల పరిమాణం పరంగా ఈ బ్యాంకులు మొత్తం పరిశ్రమలో 59 శాతం వాటా కలిగి ఉన్నాయి.  సగం బ్యాంకులు 2020 రెండో అర్ధ భాగంలో ఎన్‌పీఏలు తగ్గాయని పేర్కొన్నాయి. 78 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులూ ఇదే సమాచారం ఇచ్చాయి.
2021 తొలి 6 నెలల కాలంలో ఎన్‌పీఏలు 10 శాతానికి పైగా నమోదు కావొచ్చని 68 శాతం బ్యాంకర్లు పేర్కొన్నారు. ఎన్‌పీఏలు 12 శాతానికి చేరొచ్చని 37% బ్యాంకర్లు వెల్లడించారు. 
ఎన్‌పీఏలు అధికంగా నమోదయ్యే రంగాల్లో పర్యాటకం, ఆతిథ్యం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, విమానయానం, రెస్టారెంట్లు ఉన్నాయి. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఎన్‌పీఏలు ఎక్కువగా పెరుగుతాయని 55 శాతం మంది బ్యాంకర్లు అంచనా వేయగా, ఓ మోస్తరుగా పెరగొచ్చని 45 శాతం మంది పేర్కొన్నారు.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగంలో ఎన్‌పీఏలు పెరుగుతాయని 84% మంది బ్యాంకర్లు వెల్లడించారు. 
* రెస్టారెంట్ల రంగంలో ఎన్‌పీఏలు పెరుగుతాయని 89 శాతం మంది తెలిపారు. 26 శాతం మంది ఈ రంగంలో గణనీయంగా ఎన్‌పీఏలు పెరుగుతాయని వివరించారు.
* మౌలికం, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో దీర్ఘకాలానికి రుణగిరాకీ బాగా పెరుగుతోందని సర్వే తెలిపింది.
ఔషధ రంగంలో దీర్ఘ కాలిక రుణాల కోసం ఎక్కువ ఆసక్తి కనిపించిందని 45 శాతం మంది బ్యాంకర్లు పేర్కొన్నారు. 

 

ఇవీ చదవండి..
అమెరికా చమురే ఎందుకు..

విక్రయానికి 13 విమానాశ్రయాలు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని