డెబిట్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌.. ఇకపై ఆధార్‌, ఓటీపీతో UPI సేవలు!

UPI సేవలు పొందాలంటే బ్యాంకు డెబిట్‌ కార్డు తప్పనిసరి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ డెబిట్‌కార్డు లేనివారు, వాటిని వాడని వారు చాలా మందే ఉన్నారు.

Published : 11 Mar 2022 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో యూపీఐ (UPI) చెల్లింపుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వాట్సాప్‌ వంటి మెసేజింగ్‌ సేవలందించే సంస్థలతో పాటు గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి థర్డ్‌ పార్టీ సంస్థలు సైతం వివిధ ఆఫర్లతో ఆకట్టుకుంటుండంతో యూపీఐ చెల్లింపులకు ఆదరణ పెరిగింది. ఈ సేవలు పొందాలంటే బ్యాంకు డెబిట్‌ కార్డు తప్పనిసరి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ డెబిట్‌కార్డు లేనివారు, వాటిని వాడని వారు చాలా మందే ఉన్నారు. వీరంతా యూపీఐ సేవలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (NPCI) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా యూపీఐ సేవలను పొందడానికి వీలుగా మార్పులు చేయాలని బ్యాంకులకు సూచించింది.

ప్రస్తుతం యూపీఐ సేవలు పొందాలంటే డెబిట్‌ కార్డుపై ఉన్న చివరి ఆరు అంకెల నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ధ్రువీకరణ తర్వాత యూపీఐ పిన్‌ సెట్‌ చేసుకున్నాక నిరంతరాయ సేవలను పొందే వీలుంది. ఆధార్‌ నంబర్‌తో చెల్లింపుల కోసం గతేడాదే ఎన్‌పీసీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 15లోపు నిబంధనలు అమలు చేయాలని సూచించింది. వివిధ కారణాల వల్ల బ్యాంకులకు వీలు పడకపోవడంతో తాజాగా ఆ గడువును ఎన్‌పీసీఐ మార్చి 15కి పొడిగించింది.

దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున జన్‌ధన్‌ ఖాతాలు తెరిచారు. వారిలో కొంతమందికి డెబిట్‌ కార్డులు జారీచేసినప్పటికీ... కార్డులను యాక్టివేట్‌ చేసి వాడుతోంది తక్కువే. ఈ నేపథ్యంలో అలాంటి వారు కూడా యూపీఐ సేవలు పొందేందుకు వీలుగా ఎన్‌పీసీఐ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆధార్‌, ఓటీపీతో యూపీఐ సేవలు పొందాలంటే ఉపయోగించే మొబైల్‌ నంబర్‌ ఆధార్‌కు అనుసంధానం చేసిన ఉండాలి. అదే నంబర్‌ బ్యాంకు ఖాతాకు కూడా అనుసంధానం చేసి ఉంటేనే సాధ్యపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని