NPS: ఈ ఒక్క పథకంతో ఇటు పన్ను మినహాయింపు.. అటు రిటైర్‌మెంట్‌ ఫండ్‌!

NPS: ఎన్‌పీఎస్‌లో చేసే జమ వల్ల ఓవైపు రిటైర్‌మెంట్‌ తర్వాతి జీవితానికి కావాల్సిన నిధి సిద్ధమవుతుంది. మరోవైపు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

Published : 23 Feb 2023 12:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడులకు మార్చి 31తో గడువు ముగియనుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన ఎన్‌పీఎస్‌ (NPS)- పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌కి కూడా ఉపయోగపడుతుంది.

రెండు రకాల ఖాతాలు

ఎన్‌పీఎస్‌ (NPS)లో రెండు రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. టైర్‌-I ఖాతా అందరికీ తప్పనిసరి. దీంట్లో లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే నిర్దిష్ట గడువు ముగిసే వరకు పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉండదు. దీంట్లో పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మరొకటి టైర్‌-II ఖాతా. ఇది తప్పనిసరేం కాదు. దీంట్లో నుంచి డబ్బు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ, పన్ను ప్రయోజనాలు ఉండవు.

ఇవీ పన్ను ప్రయోజనాలు..

ఎన్‌పీఎస్‌ (NPS) ఖాతాలో డబ్బు వేసే ప్రతిఒక్కరు సెక్షన్‌ 80సీసీడీ(1) కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. అయితే, సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80సీసీసీ, సెక్షన్‌ 80సీసీడీ మూడింటిని ఉపయోగించుకొని గరిష్ఠంగా రూ.1.5 లక్షలపై మాత్రమే పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. సెక్షన్‌ 80సీసీసీ పెన్షన్‌ ఫండ్‌లకు వర్తిస్తుంది. ఎన్‌పీఎస్‌ (NPS), అటల్‌ పెన్షన్‌ యోజనకు సెక్షన్‌ 80సీసీడీ అమలవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది 80సీ కింద పీపీఎఫ్‌, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, పిల్లల ట్యూషన్‌ ఫీజులను చూపించి రూ.1.5 లక్షల పన్ను మినహాయింపును పొందుతారు. దీంతో ప్రత్యేకంగా ఎన్‌పీఎస్‌ (NPS)కు వర్తింపజేయడానికి పరిమితి ముగిసిపోతుంది. అలాంటప్పుడు 80సీసీడీ(1బి) కింద అదనంగా రూ.50 వేలపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయ పన్ను చట్టం అవకాశం కల్పిస్తోంది.

కంపెనీ చేసే జమపై పన్ను ఇలా..

ఒకవేళ కంపెనీయే తమ ఉద్యోగి ఎన్‌పీఎస్‌ (NPS) ఖాతాలో నిధులు జమ చేస్తున్నట్లయితే సెక్షన్‌ 80సీసీడీ(2) కింద పన్ను రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. కంపెనీలు జమ చేసే నిధులను తొలుత ఉద్యోగి వేతనానికి కలుపుతారు. అప్పుడు ఉద్యోగి తన మూల వేతనం, కరవు భత్యంపై 14 శాతం (ప్రభుత్వ ఉద్యోగులు) లేదా 10 శాతం (ఇతర ఉద్యోగులు) వరకు సెక్షన్‌ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.

రూ.7.5 లక్షల పరిమితి..

కంపెనీ జమ చేసే నిధులపై సెక్షన్‌ 80సీసీడీ కింద పన్ను ప్రయోజనాన్ని పొందేందుకు గతంలో ఎలాంటి పరిమితి ఉండేది కాదు. అంటే సంస్థ జమతో కలుపుకొని మూలవేతనం, డీఏపై 14 శాతం వరకు పన్ను రాయితీ పొందే అవకాశం ఉండేది. కానీ, అధిక వేతనం పొందే ఉద్యోగులు పెద్ద మొత్తంలో పన్ను రాయితీ పొందుతున్నారని మార్పులు చేశారు. బడ్జెట్‌ 2020లో దీన్ని ప్రతిపాదించారు. ఒకవేళ ఉద్యోగి ఎన్‌పీఎస్‌ (NPS), రిటైర్‌మెంట్‌ ఫండ్‌లోకి కంపెనీలు జమ చేసే మొత్తం రూ.7.5 లక్షలు దాటితే, ఆ అదనపు మొత్తంపై ఉద్యోగి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దానిపై వచ్చే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.

స్వయం ఉపాధి పొందేవారికీ..

స్వయం ఉపాధి పొందే వారు కూడా ఎన్‌పీఎస్‌ (NPS)లో చేసే జమపై పన్ను మినహాయింపు పొందొచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం ఉంటుంది. అదనంగా సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఉపసంహరణపై పన్ను..

రిటైర్‌మెంట్‌ సమయంలో ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులు ఖాతాలో జమయిన నిధుల్లో 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను విధించరు. మిగిలిన 40 శాతం నిధులతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్‌ ద్వారా లభించే పెన్షన్‌ను మొత్తం ఆదాయంలో కలిపిన తర్వాత వర్తించే శ్లాబ్‌ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్షికంగా ఉపసంహరించుకోవాలనుకుంటే మొత్తం ఎన్‌పీఎస్‌ (NPS) నిధుల్లో 25 శాతంపై ఎలాంటి పన్ను ఉండదు. అంతకు మించితే సంబంధిత పన్ను శ్లాబ్‌ కింద పన్ను చెల్లించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని