NPS: ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాల‌ను ఎప్పుడు అనుమ‌తిస్తారు?ఎంత తీసుకోవచ్చు?

కొన్ని ప్ర‌త్యేక కార‌ణాల‌తో మాత్ర‌మే ఎన్‌పీఎస్ నుంచి పాక్షిక విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది

Updated : 11 Jun 2022 15:28 IST

ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత, అంటే ఒక వ్య‌క్తి 60 సంవ‌త్స‌రాల త‌ర్వాత జీవ‌నం కోసం పెన్ష‌న్ పొందేందుకు ఉద్దేశించినదే జాతీయ ఫించ‌ను ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌). ఇందులో చందాదారులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి క‌నీసం రూ. 1000 జ‌మ చేయ‌వ‌చ్చు, గ‌రిష్ట ప‌రిమితి లేదు. ఎన్‌పీఎస్‌లో.. టైర్ I, టైర్ II అని రెండు ర‌కాల ఖాతాలుంటాయి. ఎన్‌పీఎస్‌లో చేరాల‌నుకునే చందాదారులు పెన్ష‌న్ కోసం ఖ‌చ్చితంగా టైర్ - I ఖాతాలో చేరాలి. టైర్-II ఖాతాలో స్వ‌చ్ఛందంగా మదుపు చేయ‌వ‌చ్చు. టైర్-II ఖాతాలో విత్‌డ్రాలు ఎప్పుడైనా చేయ‌వ‌చ్చు. టైర్-I ఖాతాలో విత్‌డ్రాల‌కు మాత్రం కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎన్‌పీఎస్‌ ఉపసంహరణ నియమాలు..

1. ప‌ద‌వీ విర‌మ‌ణ‌పై..
ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి ఉన్న మొత్తంలో క‌నీసం 40 శాతం మొత్తాన్ని యాన్యూటీల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు, లేదా ఈ మొత్తాన్ని ఎన్‌పీఎస్ స‌భ్యుడు 70 ఏళ్ల వయసు వ‌ర‌కు కొన‌సాగించ‌వ‌చ్చు. ఒక‌వేళ ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి సేక‌రించిన మొత్తం రూ. 5 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే త‌క్కువ‌గా ఉంటే, పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. దీనిపై ప‌న్ను వ‌ర్తించ‌దు.  

ఉదాహ‌ర‌ణికి, మీకు ప‌ద‌వీవిర‌మ‌ణ నాటికి ఖాతాలో సేక‌రించిన మొత్తం రూ. 4.50 ల‌క్ష‌లు ఉంటే పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఒక‌వేళ రూ 5.10 ల‌క్ష‌లు ఉంటే యాన్యుటీ కోసం క‌నీసం 40 శాతం మొత్తాన్ని కేటాయించాలి. ఎన్‌పీఎస్ కాలిక్యులేట‌ర్లు ఇప్పుడు ఆన్‌లైన్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉప‌యోగించి మీరు ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి సేక‌రించగ‌లిగే మొత్తాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. 

2. స్వ‌చ్ఛంద‌ విర‌మ‌ణ చేస్తే..
ఎన్‌పీఎస్ నిధి మొత్తంలో క‌నీసం 80 శాతం మొత్తాన్ని యాన్యుటీల‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఒక‌వేళ స్వచ్ఛంద విర‌మ‌ణ చేసేనాటికి సేక‌రించిన పెన్ష‌న్ నిధి మొత్తం రూ. 2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉంటే..ఆ వ్య‌క్తి పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. 

3. చందాదారుడు మ‌ర‌ణిస్తే..
ప‌ద‌వీ విర‌మ‌ణ కంటే ముందే చందాదారుడు మ‌ర‌ణిస్తే, పూర్తి మొత్తాన్ని నామినీ/చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అంద‌జేస్తారు. 

ఎన్‌పీఎస్ పాక్షిక విత్‌డ్రా నియ‌మాలు..

* ఎన్‌పీఎస్‌లో చేరిన తేది నుంచి క‌నీసం మూడేళ్ల పాటు ఖాతాను కొన‌సాగించిన త‌ర్వాత మాత్ర‌మే పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.

* ఖాతాలో సేక‌రించిన మొత్తం నుంచి 25 శాతం కాంట్రీబ్యూష‌న్ల‌ను పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

* ఎన్‌పీఎస్‌లో స‌భ్య‌త్వం ఉన్న చందాదారులు మొత్తం కాల‌వ్య‌వధిలో 3 సార్లు మాత్ర‌మే ఎన్‌పీఎస్ ఖాతా నుంచి అనుమ‌తించిన మేర‌కు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

* కొన్ని ప్ర‌త్యేక కార‌ణాల‌తో మాత్ర‌మే ఎన్‌పీఎస్ నుంచి పాక్షిక విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.


1. విద్య‌, వివాహం (పిల్ల‌ల విద్య, వివాహం కోసం గానీ, చందాదారుడే ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌నుకున్న‌ప్పుడు గానీ తీసుకోవ‌చ్చు) 
2. ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం (మొద‌టి సారి ఇంటి కొనుగోలుకు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. చందాదారుడు విడిగా గానీ, జీవిత భాగ‌స్వామితో క‌లిసి గానీ ఇల్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు)
3. వైద్య అవ‌స‌రాలు (చందాదారుడు లేదా అత‌ను/ఆమె జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు, ఆధారిత త‌ల్లిదండ్రులు నిర్ధిష్ట వ్యాధుల భారిన ప‌డిన‌ప్పుడు లేదా ప్ర‌మాదం జ‌రిగి ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌చ్చిన‌ప్పుడు తీసుకోవ‌చ్చు)
4. చందాదారుడు ఉన్న‌త‌ ఉద్యోగం కోసం నైపుణ్యం కోసం ఏదైనా కోర్సును నేర్చుకునేందుకు 
5. స్టార్ట‌ప్ లేదా వ్యాపారాన్ని ప్రారంభించాల‌నుకున్న‌ప్పుడు ఎన్‌పీఎస్ నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. 

* ఎన్‌పీఎస్ నుంచి ఒక‌సారి పాక్షికంగా విత్‌డ్రా చేసుకున్న త‌ర్వాత మ‌ళ్లీ ఐదేళ్ల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకునే (కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌ను మిన‌హాయించి) వీలుండ‌దు. 

ఉదాహ‌ర‌ణ‌కి, మీరు ఎన్‌పీఎస్‌లో చేరి మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఖాతాలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌మ‌కూర్చుకున్నార‌నుకుందాం. ఈ రూ. 6 ల‌క్ష‌ల నుంచి 25 శాతం మొత్తం అంటే రూ. 1.50 లక్ష‌ల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మ‌రోసారి విత్‌డ్రా చేసుకోవాలంటే మ‌రో ఐదేళ్లు ఆగాల్సి ఉంటుంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని