ఎన్ఎస్‌సీ (Vs) కిసాన్ వికాస్ ప‌త్ర (Vs) బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌

లిక్విడిటీ, వడ్డీ రేటు లాంటి వాటిని బట్టి మీరు పధకాన్ని ఎంచుకోవచ్చు

Published : 01 Mar 2022 12:46 IST

సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల‌కి పోస్టాఫీస్‌, ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో, పేరున్న ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పొదుపు చేయ‌డం చాలా న‌మ్మ‌క‌మైన పెట్టుబ‌డులే కాక హామితో కూడా కూడుకున్న‌వి. వీటిలో పెట్టుబ‌డి పెట్టేవారి సంఖ్య కూడా దేశంలో కోట్ల‌లోనే ఉంటుంది. ఎన్ఎస్‌సీ (నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్స్‌), కేవీపీ (కిసాన్ వికాస్ ప‌త్ర‌), ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎక్కువ మందిని ఆక‌ర్షించే సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డులు.

స‌మీప భ‌విష్య‌త్తులో బ్యాంక్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల క‌ద‌లిక ఉంటుంద‌ని, లేక ఇలాగే కొన‌సాగుతాయ‌ని కొన్ని అధ్య‌య‌నాలు తెలిపాయి. ఆర్‌బీఐ చాలా నెల‌లుగా రెపో రేటును స్థిరంగా ఉంచింది. పోస్టాఫీస్ సేవింగ్స్ రేట్లు కూడా గ‌త కొన్ని నెల‌లుగా మార‌లేదు.

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్స్ (ఎన్ఎస్‌సీ):

ఇవి 5 సంవ‌త్స‌రాల డిపాజిట్లు, వీటిని పోస్టాఫీసుల‌లో చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు వార్షికంగా 6.80% ఉంది.  పెట్టుబడి 5 సంవ‌త్స‌రాలు లాక్ చేయ‌బ‌డి ఉంటుంది. పెట్టుబ‌డిదారుల‌కు నెల‌వారీ లేదా వార్షిక ప్రాతిప‌దిక‌న వ‌డ్డీ చెల్లింపు ఉండ‌దు. పెట్టుబ‌డి పెట్టిన అస‌లుతో పాటు మెచ్యూరిటీ టైమ్‌లో మాత్ర‌మే చెల్లించ‌బ‌డుతుంది. `ఎన్ఎస్‌సీ`లో గ‌రిష్ట ప‌రిమితి లేదు, క‌నీస పెట్టుబ‌డి రూ. 1,000. 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ. 1389.49కి పెరుగుతుంది.

5 ఏళ్ల వ్య‌వ‌ధిలో త‌మ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఆదా చేయాల‌నుకునే వారికి, 5 సంవ‌త్స‌రాల ప‌న్ను ఆదా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, `ఎన్ఎస్‌సీ`లు కూడా ప‌న్ను ఆదాకి ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. అయితే `ఎన్ఎస్‌సీ`, ప‌న్ను ఆదా చేసే 5 సంవ‌త్స‌రాల బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వ‌డ్డీ రేటును అందిస్తుంది.

కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ):

కిసాన్ వికాస్ ప‌త్ర‌లో పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బు మెచ్యూరిటీకి అంటే..124 నెల‌ల‌కు రెట్టింపు అవుతుంది. మ‌ధ్య‌లో ఎక్క‌డా కూడా వ‌డ్డీ చెల్లించ‌బ‌డ‌దు. పెట్టుబ‌డి పెట్టిన మొత్తం 124 నెల‌ల్లో మూల‌ధ‌నంతో పాటు వ‌డ్డీ మెచ్యూరిటీ టైమ్‌లో మాత్ర‌మే చెల్లించ‌బ‌డుతుంది.  డిపాజిట్ క‌నీస మొత్తం రూ. 1,000, గ‌రిష్ట ప‌రిమితి లేదు.

ప్ర‌స్తుతం, కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) వార్షికంగా 6.90% రాబ‌డిని అందిస్తుంది. అయితే, సంపాదించిన వ‌డ్డీకి ఒక‌రి ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం పూర్తిగా ప‌న్ను విధించ‌బ‌డుతుంది. నెల‌వారీ లేదా త్రైమాసిక వ‌డ్డీ చెల్లింపుల కోసం చూస్తున్న ఎవ‌రికైనా, కిసాన్ వికాస్ ప‌త్ర పెట్టుబ‌డి స‌రైన‌ది కాదు. మెచ్యూరిటీ టైమ్‌కి 10 ఏళ్లు పైగా ఆగాలి, ప‌న్ను ప్ర‌యోజ‌నం లేదు.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్:

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల‌తో స‌హా చాలా ప్ర‌ముఖ బ్యాంకులు 1-10 సంవ‌త్స‌రాల డిపాజిట్ల‌పై దాదాపు 5.50% వ‌డ్డీ రేటును అందిస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 7 రోజుల నుండి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు నిర్ణీత కాల‌వ్య‌వ‌ధికి 2.90% నుండి 5.50% వ‌ర‌కు కొద్ది స్ధాయి తేడాల‌తో పిక్స్‌డ్ వ‌డ్డీ రేటును క‌లిగి ఉంటాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎల్ల‌ప్పుడూ అన్ని బ్యాంకుల‌లో ఎఫ్‌డీల‌పై 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీని పొందుతారు. బ్యాంకు ఖాతాదారులు స్వీప్‌-ఇన్ డిపాజిట్‌ని ఎంచుకోవ‌చ్చు. దీనిలో సేవింగ్స్ ఖాతాలో నిర్దిష్ట ప‌రిమితి కంటే ఎక్కువ మొత్తం ఉంటే ఆటోమేటిక్‌గా `ఫిక్స్‌డ్ డిపాజిట్‌`గా మార్చ‌బ‌డుతుంది. 5 ఏళ్ల ప‌న్ను ఆదా ఎఫ్‌డీలు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉంటుంది. పెట్టుబ‌డిదారుడి బ్యాంకు డిపాజిట్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా ఉంటుంది.

మీకు లిక్విడిటీ ముఖ్యం అనుకుంటే బ్యాంక్ ఎఫ్‌డీ మంచి పెట్టుబ‌డి ఎంపిక‌గా  చెప్ప‌వ‌చ్చు. అయితే, చివ‌ర‌గా గుర్తించుకోవ‌ల్సింది ఏమిటంటే ఈ 3 ఎంపిక‌ల‌లో సంపాదించిన వ‌డ్డీ ఆదాయం, ఆదాయ స్లాబ్‌పై ఆధార‌ప‌డి పెట్టుబ‌డిదారుడికి పూర్తిగా ప‌న్ను విధించ‌బ‌డుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని