UHNWI: భారత్‌లో 7.5% తగ్గిన అత్యంత ధనికుల సంఖ్య.. కారణమిదే!

UHNWI: ముప్ఫై మిలియన్‌ డాలర్ల కంటే అధిక సంపద కలిగిన ధనవంతుల సంఖ్య 2022లో తగ్గినట్లు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది. అయితే, బిలియనీర్ల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగింది.

Published : 17 May 2023 19:20 IST

దిల్లీ: దేశంలో అత్యంత ధనికుల సంఖ్య క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో 7.5 శాతం తగ్గింది. అయితే, వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 58.4 శాతం పుంజుకుంటుందని ‘నైట్‌ ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌- 2023’ అంచనా వేసింది. నికర ఆస్తి విలువ 30 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.227 కోట్లు) కంటే ఎక్కువగా ఉన్న వారిని ‘అత్యంత ధనికులు (Ultra high net worth individuals- UHNWI)’గా పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

మరోవైపు బిలియనీర్ల సంఖ్య 2021లో 145గా ఉండగా.. అది 2022లో 161కి పెరిగింది. 2027 నాటికి వీరి సంఖ్య 195కు చేరుకుంటుందని నైట్‌ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది. 2022లో అత్యంత ధనికుల (UHNWI) సంఖ్య 12,069గా ఉండగా.. 2027 నాటికి అది 19,119కు చేరుతుందని అంచనా వేసింది. ఇక 1 మిలియన్‌ డాలర్ల కంటే అధిక సంపద ఉన్న ధనికుల (HNI) సంఖ్య ఏడాది వ్యవధిలో 7,63,674 నుంచి 7,97,714కు పెరిగింది. వీరి సంఖ్య 2027 నాటికి 16,57,272కు పెరుగుతుందని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యంత ధనికుల (UHNWI) సంఖ్య 2022లో 3.8 శాతం తగ్గింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్యలో 9.3 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక మందగమనం, వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక రాజకీయాల్లో అస్థిరత కారణంగా ధనికుల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడ్డట్లు నివేదిక పేర్కొంది. భారత్‌లోనూ ఇదే పోకడ కనిపించినట్లు పేర్కొంది. వడ్డీరేట్ల పెంపుతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో పతనం సైతం భారత్‌లో ధనవంతుల పెట్టుబడులపై ప్రభావం చూపినట్లు తెలిపింది.

భారత్‌లో ధనికుల సంఖ్యలో మాత్రం వార్షిక ప్రాతిపదికన 2022లో 4.5 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య సైతం 11 శాతం పెరగడం గమనార్హం. ‘‘భారత్‌లో కీలక, కీలకేతర రంగాల్లో జోరుగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయి. దీనికితోడు భారత్‌ ప్రపంచంలో అంకుర సంస్థలకు కేంద్రంగా ఉండడం సంపద సృష్టికి కారణమవుతోంది. మరోవైపు భారత్‌లో తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, టెక్‌ అంకురాల నుంచి వస్తున్న కొత్త అవకాశాలు సంపద సృష్టికి బాటలు వేస్తున్నాయి. ఫలితంగా ధనవంతుల సంఖ్య పెరుగుతోంది’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఎండీ, ఛైర్మన్‌ శిశిర్‌ బైజల్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని