Jensen Huang: జపాన్‌లో ఓ తోటమాలి విలువైన పాఠం నేర్పాడు: ఎన్విడియా సీఈవో

Jensen Huang: ఎన్వీడియా సీఈఓ ఓ తోటమాలి నుంచి నేర్చుకున్న పాఠాన్ని తాజాగా పంచుకున్నారు. ఆ గార్డెనర్‌ మాటలు తనలో ఆలోచనల్ని రేపాయన్నారు.

Published : 20 Jun 2024 16:27 IST

Jensen Huang | ఇంటర్నెట్‌డెస్క్‌: జీవితంలో ఏదో ఒక దశలో ఎవరో ఒకరి నుంచి మనం స్ఫూర్తి పొందుతుంటాం. వారు మనకు తెలిసిన వాళ్లే అయిఉండనవసరం లేదు. తెలియకుండానే వారి మాటలు మనలో సానుకూల మార్పు తీసుకొస్తాయి. కొత్తగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. మనం నిజంగా దేనిపై దృష్టి పెట్టాలో నేర్పుతాయి. ఇలానే తన జీవితంలో ఓ తోటమాలి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి అంటున్నారు ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ (Jensen Huang). ఆ గార్డెనర్‌ చెప్పిన మాటలు ప్రభావం చూపాయన్నారు.

వ్యాపార రంగంలో సవాళ్లను స్వీకరిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీ సంస్థ ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చారు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు. ఇటీవలె కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విచ్చేసిన ఆయన అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. తన జీవితంలో మార్పు తీసుకొచ్చిన విషయాన్ని వారితో పంచుకున్నారు. ‘ కుటుంబంతో కలిసి జపాన్‌లోని క్యోటోలోని సిల్వర్‌ టెంపుల్‌ను చూడటానికి వెళ్లాం. అక్కడ వేడి తీవ్రంగా ఉంది. అలానే చుట్టూ ప్రదేశాలు చూస్తున్నాం. ఆ సమయంలో తోటమాలిని చూశా. ఇంతటి ఎండలోనూ ఆయన పెద్ద తోటను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయా’’

ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ ఆమోదం.. రూ.7,250 కోట్ల సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

‘‘వెంటనే ఆయన వద్దకు వెళ్లి ‘ఇంతటి ఎండలో మీరు ఏం చేస్తున్నారు. ఈ తోట చాలా పెద్దగా ఉందే’ అని అడిగాను. ‘పిచ్చి మొక్కలు తీసేస్తున్నాను. నేనే 25 సంవత్సరాలుగా తోటను చూసుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు. ‘ఇంతటి తోటను చూసుకోవడానికి మీకు సమయం సరిపోతుందా’ అని అడిగాను. ప్రాధాన్యత ఉన్న పనికే ఎక్కువ సమయం కేటాయిస్తా అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విని ఆలోచనలో పడ్డా’’ అని చెప్పుకొచ్చారు. తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలుగా మారాయని తెలిపారు. తన పని చేయడానికి ఎంత నిబద్ధతతో ఉన్నాడో అప్పుడే తెలిసింది. పనులను ప్రాధాన్య క్రమంలో చేసుకోవడం వల్ల ఎంత సమయం ఆదా అవుతుందో అప్పుడే అర్థమైందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రతి ఉదయం ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనిని ముందుగా చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. ముఖ్యమైన పని పూర్తి చేసిన తర్వాతే ఇతర పనులు చేయడానికి మిగిలిన సమయాన్ని కేటాయిస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని