Odisha tragedy: ఒడిశా ఘటన.. రిలయన్స్‌ ఫౌండేషన్‌ దాతృత్వం

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. దాతృత్వ కార్యక్రమంలో భాగంగా సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి భోజన సదుపాయం కల్పించింది.

Updated : 05 Jun 2023 13:52 IST

ముంబయి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన (Odisha tragedy) చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 270 మందికిపైగా మృతి చెందగా..  వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. కొందరు పిల్లలు అనాథలయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడి భవిష్యత్‌లో ఏమీ చేయలేని స్థితికి చేరుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున రక్తదానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. స్థానిక యువత చూపిన చొరవ, మానవత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ (Reliance Foundation) సైతం దాతృత్వానికి ముందుకు కదిలింది.

ఒడిశా రైలు ప్రమాదం బాధితులను ఆదుకుంటామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ప్రకటించారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ కష్టకాలంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ తన వంతు సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆహారం అందించి తన వంతు చేయూతనందించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

మరోవైపు ఒడిశా ప్రమాద ఘటనపై అదానీ గ్రూప్‌ సైతం స్పందించింది. ప్రమాద ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను తమ గ్రూప్‌ తీసుకుంటుందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం దాతృత్వానికి ముందుకొచ్చారు. రైలు ప్రమాద బాధితుల పిల్లలకు సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యను అందిస్తామని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని