Crude Oil: 15 నెలల కనిష్ఠానికి క్రూడ్‌.. అయినా మనకు ధరలెందుకు తగ్గడం లేదు?

Oil hits lowest since 2021: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా తగ్గింది. 15 నెలల కనిష్ఠానికి చేరింది. అయినా మనకు మాత్రం ధరలు ఎందుకు తగ్గడం లేదు..? 

Updated : 20 Mar 2023 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude oil) ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్‌ రంగంలో వరుస కుదుపులు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు కారణంగా మాంద్యం పరిస్థితులు నెలకొంటాయన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి. మాంద్యం పరిస్థితులు తలెత్తితే చమురుకు డిమాండ్‌ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 15 నెలల కనిష్ఠానికి చేరాయి.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. కొన్ని నెలల పాటు 100 డాలర్లకు పైనే ట్రేడయ్యింది. కొన్ని నెలల నుంచి చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తాజాగా 70 డాలర్ల స్థాయికి చేరింది. మే నెల ఫ్యూచర్స్‌కు సంబంధించి బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 2 శాతం మేర క్షీణించి 70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (WTI) ఏప్రిల్‌ నెల కాంట్రాక్ట్‌లో బ్యారెల్‌ 64.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2021 డిసెంబర్‌ తర్వాత ఈ స్థాయిలో ముడి చమురు దిగి రావడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్‌ రంగంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వారం వ్యవధిలోనే 10 శాతం మేర బ్రెంట్‌, డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం.
Also Read: 17,000 దిగువకు నిఫ్టీ.. సూచీలను వెంటాడిన ‘బ్యాంకింగ్‌’ భయాలు!

మనకెప్పుడు తగ్గేది..?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. భారత్‌లో చమురు ధరలు ఎందుకు తగ్గడం లేదనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే, ఇప్పట్లో ధరలు తగ్గే సూచనలేవీ లేవని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో జరిగే చమురు విక్రయాల్లో ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలదకే మెజారిటీ వాటా. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల్లో మార్పు చేసే వెసులుబాటు ఉన్నా.. ఆయా కంపెనీలు గడిచిన 15 నెలలుగా ధరల్లో ఎలాంటి మార్పు చేయడం లేదు.  అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా ఉన్నప్పుడు ఏ ధరకు విక్రయించాయో.. ఇప్పుడూ అదే ధరకు విక్రయిస్తున్నాయి. చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య దాదాపు రూ.21వేల కోట్ల నష్టాన్ని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే నష్టాల్ని భర్తీ చేసుకుంటున్నాయి. ప్రస్తుత ముడి చమురు ధర ప్రకారం పెట్రోల్‌పై రూ.8.7, డీజిల్‌పై రూ.11.1 చొప్పున ఆయా కంపెనీలు లాభాల్ని ఆర్జిస్తున్నాయి. రెండు, మూడు త్రైమాసికాల పాటు నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే.. ధరలు తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు