OMCs Losses: ఆరు నెలల్లో చమురు సంస్థల నష్టాలు రూ.21,201 కోట్లు

దాదాపు ఏడు నెలలుగా దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెటింగ్‌ మార్జిన్లు తగ్గి నష్టాలు వస్తున్నాయి. 

Published : 08 Nov 2022 15:38 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ వరుసగా రెండో త్రైమాసికంలోనూ నష్టాలు నమోదు చేశాయి. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంయుక్తంగా రూ.2,748 కోట్ల నష్టాల్ని నివేదించాయి. దేశీయంగా రాయితీపై విక్రయిస్తున్న ఎల్‌పీజీ వల్ల తలెత్తిన నష్టాల్ని భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం గత నెల 12న ఏకకాల గ్రాంట్‌ కింద రూ.22,000 కోట్లను కేటాయించినప్పటికీ.. నష్టాలు మాత్రం తప్పలేదు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌పై అందే మార్కెటింగ్‌ మార్జిన్లలో తగ్గుదల వల్లే నష్టాలు వచ్చినట్లు ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో కంపెనీలు పేర్కొన్నాయి. ఒకవేళ గ్రాంట్‌ ఇవ్వకపోయుంటే నష్టాలు మరింత పెరిగి ఉండేవి.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలకు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని ప్రతిరోజూ సవరించుకునే వెసులుబాటు ఉంది. కానీ, గత ఏడు నెలలుగా ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. అక్టోబరు 29న రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఐఓసీ రూ.272.35 కోట్ల నష్టాల్ని నమోదు చేసింది. క్రితం త్రైమాసికంలో అవి రూ.1,995.3 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు హెచ్‌పీసీఎల్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,172.14 కోట్ల నష్టాల్ని నివేదించింది. బీపీసీఎల్‌ రూ.304.17 కోట్ల నష్టాల్ని నమోదు చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మూడు కంపెనీల నికర నష్టాలు రూ.21,201.18 కోట్లకు చేరాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణ ప్రభుత్వ చేతుల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో నష్టాలు నమోదు కాకపోవడం గమనార్హం. గత నెల విడుదల చేసిన ఏకకాల గ్రాంట్‌ నుంచి ఐఓసీకి రూ.10,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కి రూ.5,617 కోట్లు, బీపీసీఎల్‌కి రూ.5,582 కోట్లు అందాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో దేశంలో నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చమురు సంస్థలు ఇంధన ధరల్ని సవరించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫలితంగా సంభవిస్తున్న నష్టాల్ని పూడ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖతో చర్చిస్తున్నామని చమురుశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి ఇటీవల తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు