Okinawa: ఒకినావా విద్యుత్తు స్కూటర్ల రీకాల్‌.. దేశంలోనే తొలిసారి!

విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్‌ 3,215 యూనిట్ల ప్రెయిజ్‌ ప్రో స్కూటర్లను రీకాల్‌ చేసింది....

Published : 16 Apr 2022 20:22 IST

దిల్లీ: విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్‌ 3,215 యూనిట్ల ప్రెయిజ్‌ ప్రో స్కూటర్లను రీకాల్‌ చేయనుంది. బ్యాటరీలలో గుర్తించిన లోపాన్ని సరిచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం వెల్లడించింది. భారత్‌లో ఇలా విద్యుత్తు వాహనాలను రీకాల్‌ చేసిన తొలి సంస్థ ఇదే కావడం గమనార్హం. రీకాల్‌లో భాగంగా ఏవైనా లూజ్‌ కనెక్షన్లు లేదా మరేదైనా లోపం ఉంటే గుర్తించి ఉచితంగా మరమ్మతు చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఒకినావా ఆథరైజ్డ్‌ డీలర్‌షిప్‌లలో సేవలు పొందొచ్చని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్తు వాహనాలు మంటలంటుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఒకినావా రీకాల్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత వారం తిరుపూర్‌లో ఇదే కంపెనీకి చెందిన మూడు స్కూటర్లలో మంటలు చెలరేగాయి. అలాగే గత నెల జరిగిన మరో ఘటనలో 13 ఏళ్ల కూతురు సహా ఓ తండ్రి మరణించారు.

మంటలు చెలరేగిన మోడళ్లను వెంటనే రీకాల్‌ చేయాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ఇటీవల కంపెనీలకు పిలుపునిచ్చారు. తద్వారా వినియోగదారుల్లో విశ్వాసం నింపాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వాహన తయారీ సంస్థలు ఇదే చేస్తున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని