EV chargers: విద్యుత్‌ స్కూటర్‌ కొన్నారా? ఛార్జర్‌ సొమ్ము వెనక్కి!

Ola- Ather- TVS: విద్యుత్‌ వాహనం కొనుగోలు సమయంలో ఛార్జర్‌ కోసం అదనపు మొత్తం చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని కంపెనీలు తిరిగి చెల్లించనున్నాయి. దీనిపై ఆయా కంపెనీలు అధికారిక ప్రకటన మాత్రం వెలువరించలేదు.

Updated : 03 May 2023 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ స్కూటర్‌ (Electric Scooter) కొనుగోలు చేశారా? ఛార్జర్‌ కోసం (Charger) అదనంగా చెల్లించారా? అయితే మీ సొమ్ము త్వరలో వెనక్కి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఛార్జర్‌కు గానూ అదనంగా వసూలు చేసిన మొత్తాలను వాహన కంపెనీలు వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఓలా (OLA), ఏథర్‌ ఎనర్జీ (Ather), టీవీఎస్‌ మోటార్‌ (TVS) వంటి సంస్థలు తిరిగి చెల్లింపులు చేయడానికి సిద్ధమైనట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఫేమ్‌-2 సబ్సిడీ (FAME-2)  విషయంలో నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

విద్యుత్‌ వాహనాల విక్రయ సమయంలో ఈవీ హోమ్‌ ఛార్జర్‌ కోసం కంపెనీలు అదనంగా వసూలు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఫేమ్‌-2 సబ్సిడీ పొందేందుకు రూ.1.5 లక్షలకు మించకూడదన్న నిబంధనను ఉల్లంఘించి మరీ ఛార్జర్‌కు అదనంగా వసూలు చేసినట్లు తెలిసింది. దీంతో రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాహన సంస్థలు తమ ధరలను సవరించాయి. ప్రస్తుతం ఛార్జర్‌ను వాహన ఇన్‌వాయిస్‌తో పాటే అందించేందుకు సిద్ధమయ్యాయి. 

ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా ఛార్జర్‌కు వసూలు చేసిన మొత్తాలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నిర్ణయించిట్లు తెలిసింది. విద్యుత్‌ వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్‌ ఈ విధంగా సుమారు రూ.130 కోట్లు వినియోగదారులకు ఇవ్వనుందని తెలిసింది. ఇదే తరహాలో ఏథర్‌ ఎనర్జీ, టీవీఎస్‌ మోటార్‌ సైతం చెల్లింపులు చేయనున్నాయని సమాచారం. దీనిపై ఆయా సంస్థలేవీ అధికారికంగా ప్రకటన వెలువరించలేదు.

ఇదీ పథకం..

భారత్‌లో హైబ్రిడ్‌, ఎలెక్ట్రిక్‌ వాహనాల సత్వర స్వీకరణ-ఉత్పత్తి (ఫేమ్‌) పథకం కింద విద్యుత్‌ వాహన (ఈవీ) ఉత్పత్తిదారులు స్థానికంగా తయారైన ఈవీలను 40 శాతం తగ్గింపు ధరకు విక్రయించాలి. ఆ తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రాయితీగా పొందవచ్చు. ఇదే రాయితీతో ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను (ఈ2డబ్ల్యూ) ప్రోత్సహించడానికి ఫేమ్‌-2 పథకం తీసుకొచ్చారు. 2019-2022 మధ్య కాలంలో అమలులో ఉండే ఈ పథకం ద్వారా దేశంలో 10 లక్షల ఈ2డబ్ల్యూలను, 7000 విద్యుత్‌ బస్సుల తయారీని సాధించాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. తరవాత ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించి, ఫేమ్‌-2 కింద 10 లక్షల ఈ2డబ్ల్యూలకు అంతిమ ధరపై రూ.20,000 రాయితీ ఇస్తోంది. దేశమంతటా 2,700 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడమూ పథకంలో భాగమే. కానీ, ఫేమ్‌-2 మార్గదర్శక సూత్రాలను తయారీదారులు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు రావడంతో సంవత్సర కాలంగా అనేక ఈ2డబ్ల్యూ ఉత్పత్తిదారులకు సబ్సిడీని నిలిపేసింది. తాజాగా ఈ అంశంపై టీవీఎస్‌, ఓలా ఎలెక్ట్రిక్‌, హీరో మోటోకార్ప్‌, ఏథర్‌ ఎనర్జీ వంటి అనేక కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. భారతీయ ఈ2డబ్ల్యూ మార్కెట్‌లో పై నాలుగు కంపెనీలకు 40-45 శాతం వాటా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని