S1 స్కూటర్లలో ఫ్రంట్‌ ఫోర్క్ సమస్య.. రీప్లేస్‌మెంట్‌కు ముందుకొచ్చిన ఓలా

Ola Electric: తమ విద్యుత్‌ స్కూటర్లలో ఉన్న ఫ్రంట్‌ ఫోర్క్‌ సమస్యను పరిష్కరించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ ముందుకొచ్చింది. మార్చి 22 నుంచి వీటిని ఉచితంగా రీప్లేస్‌ చేసేందుకు నిర్ణయించింది.

Updated : 14 Mar 2023 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనతికాలంలో ప్రజాదరణ సొంతం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) ఎస్‌1 విద్యుత్‌ స్కూటర్లలో ఉన్న ప్రధాన సమస్య ఫ్రంట్‌ ఫోర్క్‌ (front fork). రోడ్డు మధ్యలో ఉన్నట్టుండీ విరిగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా ముందుకొచ్చింది. ఫ్రంట్‌ ఫోర్క్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించింది. ఫ్రంట్‌ ఫోర్క్‌ సస్పెన్షన్‌ పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని అప్‌గ్రేడ్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

తమ విద్యుత్‌ స్కూటర్లలో ఫ్రంట్‌ ఫోర్క్‌ సహా అన్ని పరికరాలనూ సాధారణం కంటే అధిక లోడ్‌ను మోయగలిగేలా పరీక్షిస్తామని ఓలా తెలిపింది. నిరంతర ఇంజినీరింగ్, డిజైన్‌ మెరుగుదల ప్రక్రియలో భాగంగా మరింత బలంగా, మన్నిక వచ్చేలా ఇటీవల ఫ్రంట్ ఫోర్క్ డిజైన్‌ను అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపింది. ఓలా కమ్యూనిటీలో ఎవరైనా సరే కొత్త ఫ్రంట్ ఫోర్క్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఉచితంగానే జరిగే ఈ అప్‌గ్రేడ్‌ ప్రక్రియ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది. అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకునేందుకు తామే కస్టమర్లను సంప్రదిస్తామని తెలిపింది.

ఓలా ఎస్‌1 ప్రోలో ఉన్న సింగిల్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌ సస్పెన్షన్‌ అంశం పలుమార్లు వార్తల్లో నిలిచింది. రోడ్డు మధ్యలోనే విరిగిపోయిన ఉదంతాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఫ్రంట్‌ ఫోర్క్‌ విరిగిపోవడం వల్ల ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన అప్పట్లో విపరీతంగా వైరల్‌ అయ్యింది. మరికొందరు యూజర్లు సైతం ఫ్రంట్‌ ఫోర్క్‌ గురించి వీడియోలు పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రంట్‌ ఫోర్క్‌ అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఓలా ముందుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని