Ola Electric: 1,441 ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రీకాల్‌

1,441 యూనిట్ల విద్యుత్తు ద్విచక్రవాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది....

Updated : 24 Apr 2022 15:43 IST

దిల్లీ: విద్యుత్తు వాహనాలు మంటల్లో చిక్కుకుపోయి కొందరు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) కీలక నిర్ణయం తీసుకుంది. 1,441 యూనిట్ల విద్యుత్తు ద్విచక్రవాహనాలను వెనక్కి పిలిపిస్తున్నట్లు (Recall) ప్రకటించింది. పుణెలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై ఇంకా పూర్తిస్థాయి సమీక్ష కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఏదేమైనప్పటికీ.. ప్రమాదానికి గురైన స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించామని తెలిపింది. అందులో భాగంగానే 1,441 ద్విచక్రవాహనాలను రీకాల్‌ చేస్తున్నట్లు పేర్కొంది. 

బ్యాటరీ వ్యవస్థలు, థర్మల్‌ వ్యవస్థలపై తమ సర్వీస్‌ ఇంజినీర్లు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తారని ఓలా తెలిపింది. తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు భారత ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా సరిపోతాయని పేర్కొంది. ఇటీవల భారత్‌లో పలుచోట్ల విద్యుత్తు వాహనాలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బ్యాటరీల్లో మంటలు చెలరేగి కొంతమంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈవీల వినియోగం పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఒకినవ ఆటోటెక్‌ సైతం 3000 యూనిట్ల ఈవీలను రీకాల్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని