Ola Electric: ఎలక్ట్రిక్‌ వాహన ప్రియులకు ఓలా షాక్‌.. ఎస్‌1 ప్రో ఇక ప్రియం!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌.. తన ఎస్‌1 ప్రో స్కూటర్‌ ధరను పెంచనుంది.  కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

Published : 18 Mar 2022 01:39 IST

దిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌.. తన ఎస్‌1 ప్రో స్కూటర్‌ ధరను పెంచనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. గతేడాది ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరిట రెండు స్కూటర్లను ఓలా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంట్లో ఎస్‌1 ప్రో టాప్‌ వేరియంట్‌. దీని ధర ప్రస్తుతం 1,29,999గా ఉంది. గతంలో బుక్‌ చేసుకున్న వారికి ప్రస్తుతం వాహనాలను డెలివరీ చేస్తున్న ఆ సంస్థ.. మార్చి 17-18 తేదీల్లో కొనుగోలు చేసేందుకు మరో అవకాశం కల్పించింది. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా గెరువా కలర్‌ను కూడా తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా.. పలువురు యూజర్లు ట్విటర్‌లో తాము రెండేసి వాహనాలు కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ సదరు స్క్రీన్‌షాట్లను ట్విటర్‌లో ఓలాకు, భవీశ్‌ అగర్వాల్‌కు ట్యాగ్‌ చేశారు. దీనిపై భవీశ్‌ స్పందిస్తూ.. 2, 3 వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, మార్చి 18 అర్ధరాత్రితో ప్రస్తుతం కొనుగోలు విండో ముగియనుందని చెప్పారు. వచ్చే పర్చేజ్‌ విండోలో ఎస్‌1 ప్రో ధరలను పెంచుతున్నామని, మార్చి 18 వరకే పాత ధరలు వర్తిస్తాయని పేర్కొన్నారు. తదుపరి విండో ఎప్పుడు ఓపెన్‌ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఓలా స్కూటర్లలో పనితీరును మెరుగుపరుస్తూ MoveOS 2.0 పేరిట బుధవారమే ఓలా ఓ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని