Ola Electric: ఓలా దేశీయ లిథియం-ఐయాన్‌ సెల్‌ ఆవిష్కరణ

ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌  దేశీయంగా తయారు చేసిన తొలి లిథియం-ఐయాన్‌ సెల్‌ను మంగళవారం ఆవిష్కరించింది.

Published : 12 Jul 2022 18:55 IST

దిల్లీ: ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ దేశీయంగా తయారు చేసిన తొలి లిథియం-ఐయాన్‌ సెల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కొత్త సెల్‌కు ఎన్‌ఎంసీ 2170గా నామకరణం చేసింది. తమిళనాడులోని తమ గిగాఫ్యాక్టరీలో 2023 నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ సెల్‌ తయారీలో ఉపయోగించిన ప్రత్యేక రసాయనాలు, పదార్థాల వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ ఎనర్జీని స్టోర్‌ చేసే సామర్థ్యం లభిస్తుందన్నారు. అలాగే సాధారణ సెల్స్‌తో పోలిస్తే ఈ సెల్‌ కాలపరిమితి కూడా పెరుగుతుందన్నారు. దేశీయ వాతావరణాన్ని, పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేశామని తెలిపారు.

ఈవీల తయారీ ఖర్చులో బ్యాటరీలదే 40 శాతం వాటా. ప్రస్తుతం దేశీయ ఈవీ కంపెనీలు బ్యాటరీల్లోని సెల్స్‌ను దిగుమతి చేసుకుంటాయి. వీటిని దేశీయంగా తయారు చేయగలిగితే ఈవీ ధరలు మరింత అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా దేశీయంగా తయారు చేసిన కొత్త సెల్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌లో ఈవీ పరిశ్రమ పుంజుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని దేశీయంగా రూపొందించిన మౌలిక వసతులతోనే సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ అన్నారు. ఈ క్రమంలో ఎన్‌ఎంసీ 2170 సెల్‌తో భారత్‌లో ఈవీల శకానికి ఊతం లభిస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక సెల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఓలా నిర్మించబోతోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ఆధునిక ఈవీ ఉత్పత్తుల తయారీకి బాటలు పడతాయన్నారు. విద్యుత్తు వాహనాల సాంకేతికత పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులకు తాము కట్టుబడి ఉన్నామని భవీష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని