Ola S1 Air: ఓలా నుంచి మరో విద్యుత్‌ స్కూటర్‌.. ధర, ఫీచర్లు, రేంజ్‌ వివరాలివే..

విద్యుత్‌ వాహన విభాగానికి చెందిన ఓలా ఎలక్ట్రిక్‌ భారత్‌లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. S1 Air పేరిట తక్కువ ధరలో విద్యుత్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది.

Published : 22 Oct 2022 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ వాహన విభాగానికి చెందిన ఓలా ఎలక్ట్రిక్‌ భారత్‌లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఎస్‌ సిరీస్‌లో S1, S1 ప్రో పేరిట ఇప్పటికే విద్యుత్‌ స్కూటర్లను విడుదల చేసిన ఆ సంస్థ.. తాజాగా S1 Air పేరిట తక్కువ ధరలో విద్యుత్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.79వేలుగా నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద మే 24 వరకు ఈ ధరకు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత రూ.85 వేలు చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లను లక్ష్యంగా చేసుకుని తక్కువ ధరలో ఈ స్కూటర్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది.

S1 Air స్పెషిఫికేషన్స్‌, రేంజ్‌ విషయానికొస్తే.. ఈ విద్యుత్‌ స్కూటర్‌ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 101 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లొచ్చనికంపెనీ తెలిపింది. 4.3 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. సీటు కింద 34 లీటర్ల బూట్‌స్పేస్‌ అందిస్తున్నారు. తక్కువ బరువు ఉండేలా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. ఇందులో 17.78 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్‌ అందిస్తున్నారు. బ్లూటూత్‌ కనెక్టివిటీ, వైఫై, జీపీఎస్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. మొత్తం ఐదు రంగుల్లో ఈ బైక్‌ లభ్యమవుతుంది. 4.30 గంటల్లో బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌ ద్వారా గానీ, ఓలా ఎలక్ట్రిక్‌ వెబ్‌సైట్‌ ద్వారా గానీ బుక్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి కొనుగోలు కోసం అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌లో స్కూటర్లను డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతానికైతే రూ.999 కట్టి స్కూటర్‌ను రూ.79వేల ధరను రిజర్వ్‌ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని