Ola S1 Pro: ఓలా ఎస్‌ 1ప్రోలో కొత్త సమస్య.. రివర్స్‌ మోడ్‌పై ఫిర్యాదు

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎస్‌1ప్రోలో మరో కొత్త సమస్య వెలుగుచూసింది. పుణెలో స్కూటర్‌ తగలబడిన ఘటన బయటపడగా.. రివర్స్‌ మోడ్‌లో 90 కిలోమీటర్ల వేగంతో స్కూటర్‌ చక్రం తిరుగుతున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో ఇటీవల చక్కర్లు కొట్టింది.

Published : 09 Apr 2022 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎస్‌1ప్రోలో మరో కొత్త సమస్య వెలుగుచూసింది. పుణెలో స్కూటర్‌ తగలబడిన ఘటన బయటపడగా.. రివర్స్‌ మోడ్‌లో 90 కిలోమీటర్ల వేగంతో స్కూటర్‌ చక్రం తిరుగుతున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో ఇటీవల చక్కర్లు కొట్టింది. తాజాగా మరో యూజర్‌ రివర్స్‌ మోడ్‌పై ఫిర్యాదు చేశాడు. తన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా రివర్స్‌ మోడ్‌ ఆన్‌ అవ్వడంతో తనకు స్వల్పంగా గాయాలైనట్లు ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట ఈ ట్వీట్‌ చక్కర్లు కొడుతోంది.

బెంగళూరుకు చెందిన Agent Peenya @Themangofellow అనే ట్విటర్‌ ఖాతా యూజర్‌ తనకెదురైన అనుభవాన్ని ట్విటర్‌లో పేర్కొన్నాడు. తన స్కూటీని వెనక్కి తీస్తుండగా.. ఆటోమేటిక్‌గా రివర్స్‌మోడ్‌లోకి వెళ్లిందని, యాక్సిలేటర్‌ ఉపయోగించడంతో వెనక్కి వెళ్లడం ప్రారంభించిందని తెలిపాడు. ఈ క్రమంలో స్వల్పంగా గాయపడ్డానని, స్కూటర్‌పైనా గీతలు పడ్డాయని పేర్కొన్నాడు. దీనిపై ఓలా ఎలక్ట్రిక్‌కు ఫిర్యాదు చేస్తే రెండ్రోజుల తర్వాత స్పందించారని, వారం తర్వాత రిపేర్‌ చేసి స్కూటర్‌ను మళ్లీ తనకు అప్పగించారని పేర్కొన్నాడు. అయినా, సమస్య అలానే ఉందని రాసుకొచ్చాడు. తర్వాత రీజనల్‌ ఆఫీసర్‌ తనతో మాట్లాడారని, సమస్యను పరిష్కరించినట్లు చెప్పాడని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరో యూజర్‌ సైతం తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ట్విటర్‌లో ఫిర్యాదు చేయడం చేశాడు.

సాధారణంగా ద్విచక్రవాహనాల్లో రివర్స్‌మోడ్‌ ఫీచర్‌ ఉండదు. కానీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ సదుపాయాన్ని ఆయా కంపెనీలు తీసుకొస్తున్నాయి. అయితే, రివర్స్‌మోడ్‌ ఆన్‌ చేసేటప్పుడు గరిష్ఠంగా 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం వెళ్లకూడదు. కొన్ని కంపెనీలు ఈ స్పీడ్‌ లిమిట్‌ను అనుసరిస్తున్నాయి. కానీ ఇటీవల వెలుగుచూసిన ఓ వీడియోలో గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ఓలా ఎస్‌1ప్రో వెనుక చక్రం తిరగడం కనిపించింది. దీనిపై ఓలా స్పందించలేదు. మరోవైపు పుణెలో స్కూటీ దగ్ధమైన ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని