Ola Electric: ఓలా కార్ల ఫ్యాక్టరీకి స్థల సేకరణ.. పరిశీలనలో తెలంగాణ?

విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిశగా వేగంగా ముందుకెళ్తోంది....

Published : 27 May 2022 19:46 IST

దిల్లీ: విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిశగా వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేసిన ఈ సంస్థ తయారీ కేంద్రం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు.

దాదాపు 1000 ఎకరాల్లో కారు, సెల్‌ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు రచించినట్లు సదరు అధికారి వెల్లడించారు. అందుకోసం తెలంగాణ సహా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆరంభానికి భూ కేటాయింపు విషయంలో తుది నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఓలా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఓలా ఎలక్ట్రిక్‌కు ఇప్పటికే తమిళనాడులోకి కృష్ణగిరిలో 500 ఎకరాల్లో ఫ్యూచర్‌ఫ్యాక్టరీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రం. తాజాగా సేకరించనున్న 1000 ఎకరాలు ప్రత్యేకంగా కారు, వాటి బ్యాటరీకి అవసరమయ్యే సెల్స్‌ తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నారు. 2020 డిసెంబరులో ఓలా విద్యుత్తు స్కూటర్ల తయారీని తమిళనాడులో ప్రారంభించింది. గత ఏడాది డిసెంబరు 15న వినియోగదారులకు డెలివరీలు అందజేసింది. వచ్చే 2-3 ఏళ్లలో ఓలా నుంచి తొలి విద్యుత్తు కారు రాబోతోందని కంపెనీ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ఇప్పటికే ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని