Ola layoffs: ఓలాలో 200 మంది ఉద్యోగుల తొలగింపు

ఓలా సంస్థ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. దాదాపు 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడింది.

Updated : 13 Jan 2023 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా (Ola) ఉద్యోగుల తొలగింపు (layoffs) ప్రక్రియను ప్రారంభించింది. టెక్‌, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ టీమ్‌కు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులకు తాజాగా ఉద్వాసన పలికింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఓలా క్యాబ్స్‌, ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడినట్లు ఐఎన్‌సీ42 వార్తా సంస్థ తెలిపింది.

సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఎప్పటికప్పుడు పునర్నిర్మాణ చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని అవసరం లేని రోల్స్‌ కూడా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌, డిజైన్‌ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. సీనియర్‌ టాలెంట్‌ను చేర్చుకోవడం తమ ప్రాధాన్య అంశమని చెప్పారు.

దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు ఓలా కంపెనీ గతేడాదే ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని  కోరింది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్‌ విభాగంపై దృష్టి సారించడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంది. మరికొన్ని వారాల పాటు పునర్నిర్మాణానికి సంబంధించిన కసరత్తులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు గతేడాది మార్చిలో కొనుగోలు చేసిన నియో బ్యాంకింగ్‌ సంస్థ అవైల్‌ ఫైనాన్స్‌ను ఓలా మూసివేసింది. దాన్ని ఓలా మనీలో విలీనం చేయాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని