Ola Update: వచ్చేవారమే ఓలా MoveOS 3.. కొత్తగా రాబోతున్న ఫీచర్లివే..

Ola electric: ఓలా విద్యుత్‌ స్కూటర్‌ వినియోగదారులకు వచ్చేవారం MoveOS3 అప్‌డేట్‌ విడుదల చేయనుంది. దీంతో కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

Published : 15 Dec 2022 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola electric) తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఓలా ఎస్‌1, ఎస్‌ 1 ప్రో విద్యుత్‌ స్కూటర్లకు మూవ్‌ ఓఎస్‌ 3ను (MoveOS3) వచ్చే వారమే విడుదల చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. మూవ్‌ ఓఎస్‌3కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు ఈ ఏడాది దీపావళి రోజున కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఓలా ఎస్‌1 ఎయిర్‌ మాత్రమే మూవ్‌ ఓఎస్‌ 3తో వస్తోంది. ఓలా తీసుకొస్తున్న మూవ్‌ ఓఎస్‌3 ద్వారా స్కూటర్‌ పనితీరు మెరుగు అవ్వడంతో పాటు కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

  • కొత్త అప్‌డేట్‌ ద్వారా ఓలా స్కూటర్లలో హైపర్‌ ఛార్జింగ్‌ సదుపాయం వస్తుంది. దీనివల్ల కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 50 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
  • ఓలా మూవ్‌ ఓస్‌3లో వస్తున్న మరో సదుపాయం ప్రాక్సిమిటీ అన్‌లాక్‌. ఈ ఫీచర్‌ ద్వారా ఓలా స్కూటర్లను తాళం లేకుండానే వినియోగించొచ్చు. వాహనదారుడు దగ్గరకు రాగానే వాహనం ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. దూరం వెళ్లినప్పుడు లాక్‌ అవుతుంది.
  • మూవ్‌ ఓఎస్‌3లో వస్తున్న మరో ఫీచర్‌ పార్టీ మోడ్‌. యూజర్‌ వినే సాంగ్‌ను బట్టి హెడ్‌లైట్స్‌ దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తాయి. ఇందుకోసం ప్రొప్రైటరీ యాప్‌ ద్వారా అనుసంధానం అవ్వాల్సి ఉంటుంది.
  • స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు ఎవరైనా కాల్‌ చేస్తే వారి పేరు ఇకపై స్క్రీన్‌ డ్యాష్‌బోర్డులో కనిపిస్తుంది. దానికి ఆటోరిప్లయ్‌ కూడా ఇవ్వొచ్చు. వీటితో పాటు హిల్‌ అసిస్ట్‌ సదుపాయం కూడా కొత్తగా తీసుకొస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని