Bike taxi: ఓలా, ఉబర్‌కు దిల్లీ సర్కారు షాక్‌.. బైక్‌ ట్యాక్సీలపై బ్యాన్‌!

Bike taxi services banned in Delhi: బైక్‌ ట్యాక్సీ సేవలను నిషేధిస్తూ దిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Updated : 21 Feb 2023 14:34 IST

దిల్లీ: ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్లు ఓలా (Ola), ఉబర్‌ (Uber), ర్యాపిడో (Rapido)కు దిల్లీ సర్కారు షాకిచ్చింది. బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ కేటగిరీకి చెందిన వాహనాలను ట్యాక్సీల కోసం వినియోగిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మోటారు వాహనాల చట్టం, 1988ను ఉల్లంఘించడమే అవుతుందని దిల్లీ రవాణా శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా బైక్‌ ట్యాక్సీలు నడిపితే రూ.5వేలు జరిమానా విధిస్తామని దిల్లీ సర్కారు హెచ్చరించింది. పునరావృతం అయితే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించింది. డ్రైవింగ్‌ లైసెన్సు కూడా మూడేళ్ల పాటు సస్పెండ్‌ చేస్తామని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దిల్లీ ట్రాఫిక్‌ సిబ్బంది ఇప్పటికే తనిఖీలు ప్రారంభించినట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

బైక్‌ ట్యాక్సీల్లో ఎమర్జెన్సీ బటన్‌కు సంబంధించి ఎలాంటి ఏర్పాటూ ఉండదు. దీనివల్ల మహిళా ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ దిల్లీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనలు ప్రకారం కేవలం ఫోర్‌ వీలర్లు, ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు మాత్రమే ట్యాక్సీ సర్వీసుల కింద నడపడానికి అనుమతి ఉందని, బైకులకు అనుమతి లేదని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే 2 వీలర్‌, 3 వీలర్‌, 4 వీలర్‌కు సంబంధించి కొత్త అగ్రిగేటర్‌ పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నామని దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌ తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ తరహా సేవలను నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని