కర్ణాటకలో ఓలా, ఉబర్‌, ర్యాపిడోకు షాక్‌.. ఆటో సర్వీసులు బంద్‌!

ఓలా, ఉబర్‌, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే మూడు రోజుల్లో ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది.

Updated : 07 Oct 2022 19:06 IST

బెంగళూరు: యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలు అందించే ఓలా, ఉబర్‌, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే మూడు రోజుల్లో ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్ల వరకు రూ.30 వసూలు చేయాలి. ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు రూ.15 చొప్పున తీసుకోవాలి. అయితే, ఈ యాప్స్‌ తొలి 2 కిలోమీటర్లకే రూ.100 వరకు ఛార్జ్‌ చేస్తున్నాయని వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆటో రిక్షాలను నడుపుతున్నారంటూ ఆయా కంపెనీలకు నోటీసులు పంపింది. మూడు రోజులు సేవలను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చింది. 

రవాణా శాఖ నిబంధనల ప్రకారం కేవలం కార్లను మాత్రమే ట్యాక్సీలుగా నడపాలి. ఆటో రిక్షా సేవలను అందించడం నిబంధనలకు విరుద్ధం. పైగా ప్రభుత్వం విధించిన ఛార్జీల కంటే ఆయా కంపెనీలు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుకే ఆటో రిక్షా సర్వీసులను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు ఆటో డ్రైవర్లు సైతం సొంతంగా యాప్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘నమ్మ యాత్రి’ పేరిట ఓ యాప్‌ను లాంచ్‌ చేసేందుకు బెంగళూరులోని ఆటో డ్రైవర్ల యూనియన్‌ ప్రయత్నిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts