Ola Electric Car: ఓలా తొలి కారు.. ఏకంగా రూ.40-50 లక్షలా..?

Ola Electric Car:  ఓలా తీసుకురాబోయే తొలి కారుకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. దీని ధర ఏకంగా రూ.40 నుంచి రూ.50 లక్షలు ఉండబోతోందని తెలిసింది.

Published : 22 Aug 2022 22:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తీసుకొచ్చిన ఆ సంస్థ.. 2024 కల్లా కారును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలుత ప్రీమియం కార్లను.. ఆ తర్వాత అందుబాటు ధరలో ఉండే కార్లను తీసుకురావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా తీసుకురాబోయే తొలి కారుకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో రాబోతోందని, దీని ధర ఏకంగా రూ.40 నుంచి రూ.50 లక్షలు ఉండబోతోందని తెలిసింది. ఆ కంపెనీ సీఈఓ, ఓలా ఎలక్ట్రిక్‌ సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భారత్‌ మార్కెట్‌ ప్రపంచ స్థాయి టెక్నాలజీని అందుకోవడం లేదని అంతర్జాతీయ కంపెనీలు భావిస్తున్నాయని భవీశ్‌ అగర్వాల్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ ఆలోచనను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాము ప్రీమియం కారును తొలుత లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపారు. లక్ష రూపాయల స్కూటర్‌ మొదలు.. రూ.40-50 లక్షల ధరలో ప్రీమియం కార్లను తీసుకొచ్చే ప్రణాళిక తమ వద్ద ఉందన్నారు. దీనిబట్టి ఓలా తీసుకురాబోయే తొలి కారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉండబోతోందని తెలుస్తోంది. రానున్న 18-24 నెలల్లో ప్రీమియం కారు భారత మార్కెట్లో విడుదల కాబోతోందని భవీశ్‌ వెల్లడించారు. ఓలా తీసుకురాబోయే తొలి ఎలక్ట్రిక్‌ కారు 400-500 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుందని, కేవలం 4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే ఆ కంపెనీ ఎస్‌1 పేరిట ఓ స్కూటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ధరను రూ.99,999గా నిర్ణయించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts