LIC Listing: ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు ఏడాది.. మదుపర్లకు ₹2.4 లక్షల కోట్ల నష్టం!

One Year for LIC Listing: స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసీ లిస్టయ్యి సరిగ్గా మే 17కు ఏడాది పూర్తయ్యింది. ఏడాదిలో ఏ రోజూ ఇష్యూ ధరను ఎల్‌ఐసీ తాకకపోవడం గమనార్హం.

Updated : 17 May 2023 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాది క్రితం భారీ అంచనాలతో ఐపీఓకు వచ్చిన ఎల్‌ఐసీ (LIC).. స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యి సరిగ్గా నేటికి ఏడాది (One Year for LIC) పూర్తయ్యింది. గతేడాది మే 17న లిస్టైన ఎల్‌ఐసీ.. తొలి రోజే మదుపరులను నిరాశ పరిచింది. ఆ తర్వాత సైతం కోలుకున్న దాఖలాల్లేవు. ఈ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఇష్యూ ధరను తాకిన సందర్భం లేదు. మొత్తానికి లాభాల మాట అటుంచితే.. ఎన్నో ఆశలు రేపిన ఎల్‌ఐసీ మదుపరులకు రూ.2.4 లక్షల కోట్ల నష్టాన్ని మాత్రం మిగిల్చింది!

ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ప్రభుత్వం జారీ చేసింది. ఇష్యూ ధరను రూ.949గా ప్రభుత్వం పేర్కొంది. సరిగ్గా ఇదే రోజు లిస్టయిన ఎల్‌ఐసీ.. 8 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్‌లో అడుగుపెట్టింది. బీఎస్‌ఈలో రూ.867.20 వద్ద,  ఎన్‌ఎస్‌ఈలో రూ.872 వద్ద లిస్టయ్యింది. ఆ తర్వాత కూడా షేరు విలువ పడుతూనే ఉంది. బుధవారం (మే 17) రూ.568.25 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే 40 శాతం నష్టపోయింది. ఈ ఏడాదిలో ఏ ఒక్క రోజూ ఇష్యూ ధరకు దరిదాపుల్లోకి ఎల్‌ఐసీ రాకపోవడం గమనార్హం.

ఐపీఓ సమయంలో ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.6లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం ఆ విలువ రూ.3.6 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లకు రాబడి ఇవ్వకపోగా.. రూ.2.4 లక్షల కోట్ల నష్టాన్ని ఎల్‌ఐసీ మిగిల్చింది. నవంబర్‌-జనవరి మధ్య ఓ దశలో రూ.600-700 స్థాయికి ఎల్‌ఐసీ షేరు ధర చేరినప్పటికీ.. అదానీ వ్యవహారం తర్వాత మళ్లీ పూర్వ స్థితికి చేరడం గమనార్హం. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా రూ.550 స్థాయికి అటూఇటుగా ట్రేడవుతోంది. అయితే, ఎల్‌ఐసీ లిస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయికి చేరకపోవడానికి పలు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీనే మార్కెట్‌ లీడర్‌. అయితే, లాభాల పరంగా మాత్రం ఎల్‌ఐసీ అంత గొప్ప ఫలితాలను ప్రకటించకపోవడం మదుపరులు ఆసక్తి చూపకపోవడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు.
  • ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా రూ.21 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు ఆరు రోజులు గడువు ఇచ్చారు. అయితే, ఐపీఓకు కేవలం మూడు రెట్లు మాత్రమే స్పందన వచ్చింది. దీనికితోడు లిస్టయిన తొలిరోజే నష్టాలు చవిచూడడం సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని చెప్తున్నారు. దీనివల్ల కరెక్షన్‌కు గురైన ప్రతిసారీ ఈ తరహా కౌంటర్‌లలో అమ్మకాల ఒత్తిడి సహజం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
  • అదానీ-హిండెన్‌ బర్గ్‌ వ్యవహారం ఎఫెక్ట్‌ కూడా ఎల్‌ఐసీ షేరు ధర పెరగకపోవడానికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ సైతం పడిపోయింది. ఆ ప్రభావం ఎల్‌ఐసీ స్టాక్‌ ధరపై ప్రభావం చూపిందని మార్కెట్‌ నిపుణులు చెప్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని