మీ ఆరోగ్య బీమా ప్లాన్‌లో OPD కవర్‌ ఉందా?

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు OPD యాడ్‌-ఆన్‌ను కూడా ఎంపిక చేసుకుంటే చాలా ఖర్చులు ఆదా చేసుకోవచ్చు.

Updated : 12 Jan 2023 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా పాలసీ గురించి చాలా మందికి తెలిసిందే. ఇందులో ఆసుపత్రిలో చేరి 24 గంటలు పాటు ఇన్‌ పేషెంట్‌గా సేవలు పొందినప్పుడే క్లెయిమ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో ఉండి కీలకమైన చికిత్సలు చేయించుకున్నా బీమా కవరేజీ ఉండదు. అయితే ఆరోగ్య సంరక్షణ ఖర్చులలో గణనీయమైన భాగం డాక్టర్‌ కన్సల్టేషన్‌, మందులు, రోగనిర్ధారణ (వివిధ పరీక్షలు)కు కేటాయించాల్సి ఉంటుంది. వీటికి కూడా చాలా ఖర్చవుతుంది. వీటికి సాధారణ ఆరోగ్య బీమాలో కవరేజీ ఉండదు. అందువల్ల  ఔట్‌ పేషెంట్‌ విభాగంలో చికిత్సలు కూడా కవర్‌ అయ్యేలా బీమాలో OPD యాడ్‌-ఆన్‌ కవర్‌ తీసుకోవడం మంచిది.

OPD కవర్‌తో ప్రయోజనాలు

సాధారణంగా రోగాలు తెలియకుండానే వస్తాయి. ఎప్పుడు ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందో, ఎప్పుడు డాక్టర్‌ ద్వారా ఔట్‌ పేషంట్‌ చికిత్స పొందాల్సి వస్తుందో ఊహించలేరు. అందువల్ల రెండు పరిస్థితులకు ముందుగానే సిద్ధంగా ఉండడం మంచిది. OPD కవర్‌, ఆరోగ్య ప్రణాళికను కలిగి ఉండడం వల్ల మెరుగైన ఆరోగ్య బీమా కవరేజీని అందించడమే కాకుండా అనేక ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది.

ఉదా: మధుమేహం, ఉబ్బసం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు క్రమం తప్పకుండా డాక్టర్‌ సంప్రదింపులు అవసరం. అటువంటి కన్సల్టేషన్‌ ఖర్చులకు OPD కింద కవరేజీ ఉంటుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని చిన్న శస్త్ర చికిత్సలకు ఈ కవరేజీ ఉంటుంది. పాలసీదారులు, మొత్తం పాలసీ కాలానికి OPD కవర్‌కు అర్హులు. ఈ కవర్‌లో పాలసీదారు విస్తృత శ్రేణి క్లినిక్‌లతో పాటు కన్సల్టేషన్‌ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులకు యాక్సెస్‌ను పొందుతారు.

OPD కవర్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?

రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వక్తులు OPD కవర్‌తో కూడిన ఆరోగ్య బీమా కలిగి ఉండడం ప్రయోజనకరం. వీరి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వైరల్‌ జ్వరం వంటి ప్రాథమికమైన వాటితో సహా డాక్టర్ల కన్సల్టేషన్‌ కోసం తరచుగా ఆసుపత్రి సందర్శనలు అవసరం. అలాగే, థైరాయిడ్‌, మధుమేహం మొదలైన ముందస్తు వైద్య పరిస్థితులు ఉన్న రోగులకు, తరచుగా వైద్యుల కన్సల్టేషన్‌ అవసరమయ్యే రోగులకు OPD కవర్‌తో కూడిన వైద్య బీమా ప్రయోజకరంగా ఉంటుంది.

OPD కింద కవర్‌ అయ్యేవి..

  • డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజు
  • రెగ్యులర్‌గా జరిపే డాక్టర్‌ చెకప్‌లు
  • రోగ నిర్ధారణ పరీక్షలు
  • టీకాలు
  • వినికిడి సంబంధించి కౌన్సెలింగ్‌
  • చిన్నపాటి సర్జరీలు
  • దంత చికిత్సలు
  • కళ్లద్దాలు, కాంటాక్ట్‌ లెన్సులు.. మొదలైన వాటికి కవరేజీ ఉంటుంది

OPD కింద కవర్‌ కానివి

  • సౌందర్య సాధన చికిత్సలు
  • ప్లాస్టిక్‌ సర్జరీలు
  • చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడినప్పుడు తగిలిన గాయాలకు
  • మాదకద్రవ్యాలు సేవించడంవల్ల కలిగే అనారోగ్యాలకు
  • పరిశోధనాత్మక చికిత్సలు
  • ప్రకృతి వైద్య చికిత్సలు
  • వంధ్యత్వం, దానికి సంబంధించిన చికిత్సలు
  • స్వయంగా గాయాలు చేసుకోవడం.. మొదలైన వాటికి ఓపీడీ కింద కవరేజీ ఉండదు.

చివరిగా: వైద్యులు సూచించిన మందులతో మాత్రమే నయం చేయగల అనేక వ్యాధులు ఉంటాయి. కొన్నిసార్లు, ఈ వైద్యుల సంప్రదింపులు ఎక్కువ కాలం కొనసాగవచ్చు. వీటికి మీ సొంత ఖర్చులతో భారం పడకుండా, ఆరోగ్య బీమాను తీసుకునేటప్పుడు OPD యాడ్‌-ఆన్‌ను తీసుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు