PM Modi: ప్రధాని మోదీని కలిసిన ఓపెన్‌ఏఐ సీఈవో.. ఏఐపై చర్చ!

ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ ప్రధాని మోదీని కలిశారు. చాట్‌జీపీటీ (ChatGPT) కారణంగా ఎదురయ్యే సవాళ్లు, ఏఐ (AI) టూల్స్‌ చట్టబద్ధత వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. 

Published : 08 Jun 2023 19:33 IST

దిల్లీ: చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రధాని మోదీని కలిశారు. కొద్దిరోజుల క్రితం భారత్‌కు వచ్చిన శామ్‌.. చాట్‌జీపీటీ గురించి టెక్‌ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ప్రధాని మోదీతో కొద్ది నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశం ఎంతో గొప్పగా జరిగిందని శామ్‌ చెప్పినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఈ భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘‘ కృత్రిమ మేధ (AI) గురించి తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం కృత్రిమ మేధ వల్ల భారత్‌లో వచ్చే ఉద్యోగావకాశాలు, దాని వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించాం. కృత్రిమ మేధకు చట్టబద్ధత కల్పించడంపై కూడా మా మధ్య చర్చ జరిగింది’’ అని శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు.

కొద్దిరోజుల క్రితం శామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాల కంటే ముందుగా భారత్‌లోనే చాట్‌జీపీటీని ఎక్కువ మంది ఉపయోగించడం ప్రారంభించారని తెలిపారు. ఎక్కువ మంది భారతీయులు చాట్‌జీపీటీ పట్ల ఆసక్తి కనబరచడం తనకు సంతోషానిచ్చిందన్నారు. మరోవైపు, చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్‌ కారణంగా మానవ మనుగడకు సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు చాట్‌జీపీటీ వినియోగంపై నిషేధం విధించగా, మరికొన్ని దేశాలు కఠిన నిబంధనలు రూపొందించాయి. త్వరలో భారత్‌ ప్రవేశపెట్టబోయే నూతన డిజిటల్‌ బిల్లులో కూడా ఏఐ టూల్స్‌కు చట్టబద్ధత కల్పిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటన చేశారు. ఏఐ టూల్స్‌కు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనే దానిపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశ ప్రజల డిజిటల్‌ అవసరాలకు తగినట్లుగా సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో సైబర్‌ భద్రత అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని