Home Inspection: ఇల్లు కొంటున్నారా? తనిఖీ చేస్తున్నారా మరి!

బిల్డ‌ర్ నుంచి నేరుగా లేదా మ‌రొక య‌జ‌మాని నుంచి రీసేల్ మార్కెట్‌లో ఇంటిని కొనుగోలు చేసినా ఇది తప్పక తెలుసుకోవాలి

Updated : 21 Sep 2022 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతిల్లు కొనుగోలు చేయడమనేది చాలా మందికి ఓ క‌ల‌. కానీ కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం ఏళ్ల‌త‌ర‌బడి కూడ‌బెట్టిన డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం మాత్ర‌మే కాకుండా.. బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఈ అప్పు తీర్చేందుకు ఒక్కోసారి జీవిత కాలం ప‌ట్టొచ్చు. తీరా కొనుగోలు చేశాక నిర్మాణ లోపాలు ఉంటే.. వాటిని స‌రిచేయ‌డానికి మ‌రింత ఖ‌ర్చు అవుతుంది. దీంతో కొత్త ఇల్లు కొన్నామ‌నే సంతృప్తి ఉండ‌దు. నిర్ణ‌యం తీసుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డామ‌నే భావ‌న ఉండిపోతుంది. అందువ‌ల్ల ఇల్లు కొనుగోలు చేసే ముందే ఒక‌టికి రెండు సార్లు నిశితంగా ప‌రిశీలించ‌డం అవ‌స‌రం.

సాధార‌ణంగా ఇంటిని కొనుగోలు చేసేట‌ప్పుడు ఇల్లు ఏ ప్ర‌దేశంలో ఉంది? ఎన్ని గ‌దులు ఉన్నాయి? గ‌ది ప‌రిమాణం ఎంత ఉంది? ధ‌ర ఎంత‌? అడ్వాన్స్ ఎంత చెల్లించాలి? బ్యాంకు నుంచి రుణం వ‌స్తుందా? లేదా? అనే ధోర‌ణిలో మాత్ర‌మే చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ, ఇల్లు కొనుగోలు తుది నిర్ణ‌యం తీసుకునే ముందు వీటితో పాటు ఇంటి నిర్మాణ నాణ్య‌త‌ను తెలుసుకోవాలి. మీరు బిల్డ‌ర్ నుంచి నేరుగా కొనుగోలు చేసినా లేదా మ‌రొక య‌జ‌మాని నుంచి రీసేల్ మార్కెట్‌లో ఇంటిని కొనుగోలు చేసినా.. నాణ్య‌త‌ను తప్పక నిర్ధారించుకోవాలి. 

నిర్మాణం పూర్తైన ఇళ్ల‌కు ఎలక్ట్రికల్ పాయింట్ల నుంచి ప్లంబింగ్ పనుల వరకు, ఎర్తింగ్ లేక‌పోవ‌డం, లీకేజీ స‌మ‌స్య‌లు (ముఖ్యంగా పాత ఇళ్ల‌కు సీలింగ్ నుంచి, గోడ‌ల నుంచి నీరు కారడం) వంటి ప‌లు లోపాలు ఉండే అవ‌కాశం ఉంది. కొనుగోలుదారుడు, ఇంటి కొనుగోలుకు ముందే ఇల్లు సంద‌ర్శించిన‌ప్ప‌టికీ ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌లేక‌పోవ‌చ్చు. నిపుణులైన‌ వ్య‌క్తులు మాత్ర‌మే ఇటువంటి లోపాల‌ను గుర్తించ‌గులుగుతారు. కాబ‌ట్టి, ఇంటి కొనుగోలుకు ముందే నిపుణుల‌తో త‌నిఖీ చేయించ‌డం మంచిది.

గృహ త‌నిఖీ నివేదిక.. ఎల‌క్ట్రిక‌ల్ స‌మ‌స్య‌లు, థ‌ర్మ‌ల్ స్కానింగ్ ద్వారా క‌నిపించ‌ని లీకేజీలు లేదా తేమ స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డం, ప్లంబింగ్‌, వ‌డ్రంగి ప‌నులు, త‌లుపులు, కిటికీలు, వాటి ఫిట్టింగ్‌, గోడ‌లు, ఫ్లోరింగ్‌, సీలింగ్ వంటి 200కు పైగా చెక్ పాయింట్ల‌ను క‌వ‌ర్‌ చేస్తుంది. ఈ నివేదిక ద్వారా ఇంటి స‌మ‌స్య‌లు, వీటిని రిపేరు చేయించేందుకు అయ్యే ఖ‌ర్చు తెలుసుకోవచ్చు. ఒక‌వేళ మీరు అప్ప‌టికీ అదే ఇంటిని కొనుగోలు చేయాల‌నుకుంటే.. ఈ రిపేర్లు చేయించి ఇల్లు స్వాధీనం చేయ‌మ‌ని కోర‌వ‌చ్చు.  లేదంటే ఆ మేరకు ధ‌ర త‌గ్గించాలని అడగొచ్చు.

కొత్త ఇంటి విష‌యంలో మీరు ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నా లేదా బిల్డ‌ర్ నుంచి ఇటీవ‌లే ఇంటి తాళాలు పొందినా..  రెరా (స్థిరాస్తి అభివృద్ధి నియంత్ర‌ణ) చ‌ట్టం 14.3 నిబంధ‌న ప్ర‌కారం కొత్త ఇంటి విష‌యంలో ఇల్లు స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి 5 సంవ‌త్స‌రాల లోపు ఇంటిలో ఏదైనా నిర్మాణ స‌మ‌స్య‌లు ఎదురైతే ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త ప్ర‌మోట‌ర్/డెవ‌లప‌ర్‌పై ఉంటుంది. ఇంటి కొనుగోలుదారుడు ఇచ్చిన నోటీసు అనుస‌రించి 30 రోజుల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. లేదంటే రెరా నియ‌మాల ప్ర‌కారం ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణంగా ఇంటి స్వాధీన స‌మ‌యంలో హోమ్ ఇన్‌స్పెక్షన్‌ నిర్వ‌హించ‌వ‌చ్చు. కానీ, రీసేల్ ఆస్తి విష‌యంలో మాత్రం రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్‌, టోకెన్/అడ్వాన్స్ లేదా డౌన్‌పేమెంట్‌ మొత్తాన్ని చెల్లించే ముందే హోమ్ ఇన్‌స్పెక్షన్‌ చేయించ‌డం మంచిది. 

చివ‌రిగా: నిర్మాణ లోపాలు ఉంటే ఇంటికి త‌రచూ మ‌ర‌మ్మ‌తులు చేయించాల్సి వ‌స్తుంది. ఇందుకు అధిక మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి, టోకెన్ మొత్తం ఇచ్చే ముందు ఇంటిని త‌నిఖీ చేయించి ఇంటి నిర్మాణం, ఇత‌ర లోపాలు తెలుసుకుంటే.. భ‌విష్య‌త్‌లో రిపేర్లు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. త‌ద్వారా ఎక్కువ‌ మొత్తం రిపేర్ల‌కు ఖ‌ర్చు కాకుండా ఆదా చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని