Car Sales: కార్ల కంపెనీల వద్ద ఆర్డర్లే.. ఆర్డర్లు!

Car sales: కార్ల కొనుగోళ్లకు మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. వివిధ కంపెనీల వద్ద ప్రస్తుతం 6,53,000 యూనిట్లకు ఆర్డర్లు అందాయి. ఇది నెలవారీ సగటు విక్రయాలతో పోలిస్తే 2-2.5 రెట్లు అధికం. 

Published : 19 Jul 2022 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓవైపు ధరలు పెరిగి సామాన్యులు అల్లాడిపోతున్నారు. మరోవైపు రూపాయి పతనమై స్టాక్‌ మార్కెట్లు, దిగుమతులపై ఆధారపడిన వ్యాపారాలు ఆందోళన చెందుతున్నాయి. కరోనాతో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఇవన్నీ అడ్డంకిగా మారడంతో ప్రభుత్వం ఏం చేయాలో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కమొడిటీ ధరలు పెరిగి కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలో వాహన తయారీ సంస్థలు సైతం 2022 ఆరంభం నుంచి పలుసార్లు వాహనాల ధరల్ని పెంచాయి. అయినా... కార్లకు మాత్రం డిమాండ్‌ తగ్గడం లేదు. వివిధ కంపెనీల వద్ద ప్రస్తుతం 6,53,000 యూనిట్లకు ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. ఇది నెలవారీ సగటు విక్రయాలతో పోలిస్తే 2-2.5 రెట్లు అధికం. 

  • అత్యధికంగా మారుతీ సుజుకీ వద్ద 3.22 లక్షల కార్లకు ఆర్డర్లు ఉన్నాయని ఆ కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. వచ్చే రెండున్నర నెలల్లో వీటన్నింటినీ వినియోగదారులకు డెలివరీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. అయితే, కొత్తగా వచ్చే ఆర్డర్ల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు. 
  • ఇతర కార్ల కంపెనీలకు కూడా భారీ స్థాయిలోనే బుకింగ్‌లు అందాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా 1.30 లక్షల కార్లను డెలివరీ చేయాల్సి ఉందని ఆ సంస్థ డైరెక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ వెల్లడించారు. 
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా 1.46 లక్షల యూనిట్లను వినియోగదారులకు అందించాల్సి ఉందని ఆ కంపెనీ ఈ నెలారంభంలో పేర్కొంది.
  • లగ్జరీ కార్లకు సైతం డిమాండ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. మెర్సిడెజ్‌ బెంజ్‌ తమ ఆర్డర్‌ బుక్‌ 5000 యూనిట్లుగా ఉందని గతవారం ప్రకటించింది. ఇతర కంపెనీలు ఆర్డర్ల వివరాలు వెల్లడించనప్పటికీ.. వాటి వద్ద కూడా 50 వేల కార్లకు ఆర్డర్లు ఉండి ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
  • ప్రపంచ వాహన మార్కెట్‌లో భారత్‌ది ఐదో స్థానం. కొవిడ్‌ తర్వాత వ్యక్తిగత ప్రయాణాలకు ప్రజలు మొగ్గుచూపుతుండడంతో ప్యాసెంజర్‌ వెహికల్స్‌కు డిమాండ్‌ పెరిగింది. కానీ, తయారీ సంస్థలు మాత్రం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నాయి. సెమీకండక్టర్ల కొరత, సరఫరా వ్యవస్థల్లో లోపాలు, కమొడిటీ ధరల పెరుగుదల అడ్డంకిగా మారాయి.
  • ఇటీవల పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. సెమీకండక్టర్ల సరఫరాలో ఇబ్బందులు క్రమంగా గాడినపడుతున్నాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిలో వేగం పెంచాయి. తయారీ కేంద్రాల సామర్థ్యాన్ని ప్రస్తుతానికి 95 శాతానికి పెంచడం విశేషం. డిమాండ్‌కు అనుగుణంగా ఆయా మోడళ్లు, వేరియంట్ల ముందస్తు తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
  • బ్యాలెనో, బ్రెజా.. వంటి డిమాండ్ అధికంగా ఉండే కార్లను తయారు చేస్తోన్న మారుతీసుజుకీ ఈ నెల 1.88 లక్షల కార్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2018-19 తర్వాత ఇదే అత్యధికం. సెమీకండక్టర్ల లభ్యత పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నామని శ్రీవాస్తవ తెలిపారు. గత సెప్టెంబరులో మారుతీ తయారీ సామర్థ్యం 40 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.
  • కార్లు సహా ఇతర వాహనాల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీలో పెట్టుబడులు భారీగా పెంచనున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద చిప్‌ల తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ వెల్లడించింది. సాధారణంగా ఈ కంపెనీ అత్యాధునిక చిప్స్‌ తయారీకి అధిక ప్రాధాన్యమిస్తుంది.
  • కొత్త మోడళ్ల రాక, పండగ సీజన్‌, ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యాలు మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక మోడళ్ల కోసం ఏకంగా 18 నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు కొనుగోళ్ల ప్రాథమ్యాల్లో రంగు, వేరియంట్‌, ఫీచర్లతో పాటు లభ్యత కూడా చేరింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని