Telecom: ఓటీటీలకు లైసెన్స్‌ ఉండాలి.. ఆదాయంలో వాటా ఇవ్వాలి: కాయ్‌

వాట్సాప్, సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి కమ్యూనికేషన్‌ ఓటీటీలకూ లైసైన్స్‌ ఉండాలని టెలికాం ఆపరేటర్ల సంఘం కాయ్‌ కోరింది. ఆయా కమ్యూనికేషన్‌ సర్వీసులు టెలికాం కంపెనీలకు పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Updated : 22 Nov 2022 19:49 IST

దిల్లీ: వాట్సాప్, సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి కమ్యూనికేషన్‌ ఓటీటీలకూ (OTT) లైసైన్స్‌ ఉండాలని టెలికాం ఆపరేటర్ల సంఘం కాయ్‌ (COAI- Cellular Operators Association of India) కోరింది. ఆయా కమ్యూనికేషన్‌ సర్వీసులు టెలికాం కంపెనీలకు పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టెలికాం ముసాయిదా బిల్లు రూపకల్పనలో భాగంగా ఓటీటీ కమ్యూనికేషన్‌ సేవలను ఎలా నిర్వచించాలన్న దానిపై కొన్ని సూచనలు చేసినట్లు కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ తెలిపారు. ఆదాయంలో వాటా పంపకం విషయంలో నిబంధనలు రూపొందించాలని కోరినట్లు తెలిపారు. డేటా వినియోగం ఆధారంగా ఆదాయ పంపకాన్ని భవిష్యత్‌లో అన్ని కేటగిరీల ఓటీటీలకూ వర్తింపజేయాలని విన్నవించినట్లు చెప్పారు.

ఓటీటీలు సైతం నెట్‌వర్క్‌ ఆపరేటర్లలానే వాయిస్‌, వీడియో, టెక్ట్స్‌ సేవలను అందిస్తున్నాయని, కానీ వాటికి ఎలాంటి లైసెన్స్‌ గానీ, లైసెన్స్‌ నిబంధనలు గానీ వర్తించడం లేదని కాయ్‌ వాదిస్తోంది. వాటికీ టెలికాం కంపెనీల తరహాలో లైసెన్స్‌ ఉండాలంటోంది. పన్నులు, సుంకాల రూపంలో 30 శాతం ఆదాయాన్ని తాము ప్రభుత్వానికి చెల్లిస్తుండగా.. ఓటీటీ ప్లేయర్లు నయా పైసా కూడా చెల్లించడం లేదని చెబుతోంది. కాబట్టి ఒకే తరహా సేవలందిస్తున్న వాటన్నింటికీ ఒకే తరహా నిబంధనలు ఉండాలని  ముందు నుంచీ చెబుతోంది. ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కాయ్‌లో సభ్యులుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని