Aadhaar: ఆధార్‌ రికార్డ్‌.. ఒక్క నెలలోనే కోటి మొబైల్‌ నెంబర్ల అనుసంధానం

కేవలం ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో కోటికిపైగా ఆధార్‌లను (Aadhaar) మొబైల్‌ నెంబర్‌తో అనుసంధానం చేసినట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వెల్లడించింది. జనవరి నెలతో పోల్చుకుంటే అనుసంధానం చేయించుకున్న వారి సంఖ్య 93శాతం పెరిగినట్లు తెలిపింది.

Published : 01 Apr 2023 01:37 IST

దిల్లీ: దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ (Aadhaar) తప్పనిసరైంది. బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలన్నా.. అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా బ్యాంకులు ఆధార్‌ అడుగుతున్నాయి. మరోవైపు అత్యుత్తమ సేవలు పొందేందుకు ఆధార్‌ను మొబైల్‌ నెంబర్‌ (Aadhaar-Mobile Number)తో అనుసంధానం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ (UIDAI) చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేవలం ఫిబ్రవరి నెలలోనే కోటికి పైగా ఆధార్‌లను మొబైల్‌ నెంబర్‌తో అనుసంధానం చేసినట్లు ఉడాయ్‌ వెల్లడించింది. జనవరి నెలలో ఈ సంఖ్య 56.7లక్షలుగా ఉందని చెప్పిన ఉడాయ్‌.. జనవరితో పోల్చుకుంటే ఫిబ్రవరిలో అనుసంధానం చేసుకున్న వారి సంఖ్య 93శాతం పెరిగినట్లు వెల్లడించింది.

మరోవైపు పాన్‌ నెంబర్‌కు, ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు మార్చి 31 వరకే గడువు ఉందని ఆదాయపుపన్ను శాఖ వెల్లడించిన నేపథ్యంలోనే అత్యధికులు ఆధార్‌కు మొబైల్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం జూన్‌ 30 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 90 కోట్ల మంది తమ ఆధార్‌ను మొబైల్‌ నెంబర్‌తో లింక్‌ చేసుకున్నట్లు ఉడాయ్‌ చెబుతోంది. 

దాదాపు 1700లకు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్‌ను తప్పనిసరి చేశారు. అందువల్ల ప్రతిఒక్కరూ తమ ఆధార్‌ను మొబైల్‌ నెంబర్‌తో లింక్‌ చేసుకోవాల్సిందిగా ఉడాయ్‌ కూడా పదేపదే చెబుతోంది. కేవలం ఫిబ్రవరి నెలలోనే దాదాపు 226.29 కోట్ల ఆధార్‌ ప్రామాణిక లావాదేవీలు జరిగినట్లు ఉడాయ్‌ వెల్లడించింది. ఈ సంఖ్య జనవరి నెలలో 199.62గా ఉన్నట్లు తెలిపిన ఉడాయ్‌.. ఫిబ్రవరి 2023 వరకు 9,255.57కోట్ల ఆధార్‌ ప్రామాణిక లావాదేవీలు జరిగినట్లు చెప్పింది. వీటిలో ఎక్కువగా వేలిముద్రల ఆధారంగానే జరిగినట్లు తెలిపింది. మరోవైపు ఫిబ్రవరిలో 26.79 కోట్లమంది ఈ-కేవైసీ చేయించుకున్నట్లు ఉడాయ్‌ పేర్కొంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని