Layoffs: రోజుకు 1,600 మంది టెక్‌ ఉద్యోగుల తొలగింపు!

Layoffs: కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల తొలగింపు కొనసాగుతోంది. మాంద్యం భయాలు బలపడుతున్న నేపథ్యంలో తొలగింపు ప్రక్రియను టెక్ కంపెనీలు మరింత వేగవంతం చేశాయి.

Published : 17 Jan 2023 16:49 IST

దిల్లీ: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 2023లో ఇప్పటి వరకు రోజుకు సగటున 1,600 మంది టెక్‌ ఉద్యోగులు ఉద్వాసన (Layoffs)కు గురయ్యారని ప్రముఖ వెబ్‌సైట్‌ తెలిపింది. ఆర్థిక మాంద్యం భయాలు బలపడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు (Layoffs)ను కంపెనీలు మరింత వేగవంతం చేసినట్లు పేర్కొంది. 2022లో దాదాపు 1,000 కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్లు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెబ్‌సైట్‌ వెల్లడించింది. 

టెక్‌ రంగంలో 2022లో ప్రారంభమైన తొలగింపు (Layoffs)లు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్నట్లు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెబ్‌సైట్‌ పేర్కొంది. భారత కంపెనీలు ముఖ్యంగా అంకుర సంస్థలు ఉద్యోగుల తొలగింపు (Layoffs)ల్లో ముందు వరుసలో ఉన్నాయని తెలిపింది. దేశీయ సామాజిక మాధ్యమ కంపెనీ షేర్‌చాట్‌ (ShareChat) తమ మొత్తం సిబ్బందిలో 20 శాతానికి సమానమైన 500 మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే.  ట్విటర్‌, గూగుల్‌, స్నాప్‌, టైగర్‌ గ్లోబల్‌ పెట్టుబడులు ఉన్న షేర్‌చాట్‌ (ShareChat)లో 2,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీత్‌11 అనే ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫారమ్‌ను మూసేసిన షేర్‌చాట్‌ (ShareChat) డిసెంబరులోనే 5 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

ఓలా సైతం ఈ నెలలో 200 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వాయిస్‌ ఆటోమేటెడ్‌ అంకుర సంస్థ స్కిట్‌.ఏఐ, వేగంగా సరకులు పంపిణీ చేసే డంజో సైతం సిబ్బందిని ఇంటికి పంపిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. మొత్తం 2023 జనవరి తొలి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 91 కంపెనీలు 24,000 మందిని తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అమెజాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో 1,000 మంది ఈ నిర్ణయం వల్ల ప్రభావితం కానున్నారు.

మరోవైపు ఉద్యోగాల కోసం లింక్డిన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే ఉద్యోగాలు కోల్పోయి సతమతమవుతున్న స్నేహితులు, సన్నిహితులకు మద్దతునివ్వాలనుకునే వారికి కూడా లింక్డిన్‌ వేదికగా మారింది. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ ప్రకారం.. 2022లో గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి లింక్డిన్‌ యాప్‌ను యూజర్లు దాదాపు 58.4 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని