Startups: అంకురాల్లోనూ తప్పని తొలగింపులు..!

భారత్‌కు చెందిన సుమారు 70కిపైగా అంకుర సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. వీరిలో ఎక్కువ మంది ఎడ్యుటెక్‌ రంగానికి చెందిన కావడం గమనార్హం. భారత్‌కు చెందిన సుమారు 16 ఎడ్యుటెక్‌ స్టార్టప్‌లు 8 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.

Published : 30 Jan 2023 20:07 IST

దిల్లీ: మాంద్యం భయాలతో 2022 చివర్లో ప్రారంభమైన టెక్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ 2023లో కొనసాగుతూనే ఉంది. ట్విటర్‌తో ప్రారంభమైన ఈ తొలగింపుల పర్వం మెటా, అమెజాన్‌, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల వరకు వచ్చింది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు  గౌరవప్రదంగా ఉద్యోగులను తొలగిస్తుంటే.. మరికొన్ని కంపెనీల తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఆఫ్‌ అందుకోని ఉద్యోగులు తమ ఉద్యోగ భరోసాపై సమావేశాల్లో సీఈవోలను ప్రశ్నిస్తున్నారట. మరోవైపు స్టార్టప్‌ కంపెనీలకు సైతం తొలగింపుల ప్రక్రియ తప్పడంలేదు. 

భారత్‌కు చెందిన సుమారు 70కిపైగా అంకుర సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. స్టార్టప్‌ల నుంచి యూనికార్న్‌లుగా ఎదిగిన బైజూస్‌, ఓలా, ఓయో, అన్‌ అకాడమీ వంటి సంస్థలు ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ జారీ చేసినట్లు సమాచారం. తాజా గణాంకాల ప్రకారం గడిచిన మూడు నెలల్లో భారత్‌లో సుమారు 21 వేల మందికి పైగా టెక్‌ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది ఎడ్యుటెక్‌ రంగానికి చెందిన కావడం గమనార్హం. భారత్‌కు చెందిన సుమారు 16 ఎడ్యుటెక్‌ స్టార్టప్‌లు 8 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. షేర్‌చాట్, స్పోటిఫై, డంజో, గోమెకానిక్‌, విప్రో వంటి సంస్థలు సైతం లేఆఫ్‌లను ప్రకటించాయి. 

గత వారం గూగుల్ పెట్టుబడులు పెట్టిన సామాజిక మాధ్యమ సంస్థ షేర్‌చాట్‌ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. షేర్‌చాట్ ప్రకటన చేసిన మరుసటి రోజే వేగంగా సరకులు పంపిణీ చేసే డంజో సైతం తమ సిబ్బందిలో మూడు శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అంకురాల్లో పనిచేసే ఉద్యోగుల్లో సైతం తమ ఉద్యోగ భరోసాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు